Share News

నిడదవోలులో కట్టుతప్పిన కూటమి ధర్మం

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:11 AM

పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌ (జనసేన) ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ ఎన్నికలో కూటమి ధర్మం కట్టుతప్పింది.

నిడదవోలులో కట్టుతప్పిన కూటమి ధర్మం

  • వైస్‌చైర్మన్‌ ఎన్నికలో టీడీపీకి జనసేన షాక్‌

  • సొంత అభ్యర్థికి మద్దతు.. పవన్‌ సీరియస్‌

  • అధిష్ఠానం నిర్ణయం అమలుచేస్తామన్న మంత్రి దుర్గేశ్‌

నిడదవోలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌ (జనసేన) ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ ఎన్నికలో కూటమి ధర్మం కట్టుతప్పింది. సర్దుబాటులో భాగంగా చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేనకు, వైస్‌చైర్‌పర్సన్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. సోమవారం ముందుగా 32 మంది కౌన్సిలర్లతో, తర్వాత చైర్‌పర్సన్‌ మురాల జ్యోతితో కమిషనర్‌ తోట కృష్ణవేణి ప్రమాణం చేయించారు. అనంతరం వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీ కౌన్సిలర్‌ కొమ్మిన వెంకటేశ్వరావును జనసేన బలపరచాలి. కానీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే.. 4వ వార్డు జనసేన కౌన్సిలర్‌ కల్యాణ చక్రవర్తిని 8వ వార్డు జనసేన కౌన్సిలర్‌ గంగుల వెంకటలక్ష్మి ప్రతిపాదించగా.. ఆరో వార్డు కౌన్సిలర్‌ సంజీవ్‌ సాగర్‌ బలపరిచారు.

దీంతో టీడీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు. వెంటనే వారు కొమ్మిన వెంకటేశ్వరావును ప్రతిపాదించి మద్దతిచ్చారు. ఓటింగ్‌లో జనసేన కౌన్సిలర్లు 15 మంది, ఒక బీజేపీ కౌన్సిలర్‌, ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు కలిపి మొత్తం 18 మంది కల్యాణచక్రవర్తికి అనుకూలంగా చేతులు లేపారు. టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లే వచ్చాయి. దీంతో కల్యాణచక్రవర్తి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆ వెంటనే 13 మంది టీడీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి జనసేన నేతలు తూట్లు పొడిచారని మండిపడ్డారు. మంత్రి దుర్గేశ్‌ చెప్పినా.. కనీసం సగం మంది జనసేన కౌన్సిలర్లు కూడా మాట వినలేదంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.


జరిగిన పరిణామాలన్నింటినీ ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని.. ఒకరోజు గడువు కోరారని.. ఒప్పందం ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని తేల్చిచెప్పారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడంపై జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి దుర్గేశ్‌ నియోజకవర్గంలోనే కూటమి స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించడంపై ఆయన నుంచి వివరణ కోరారు. మంత్రి స్పందిస్తూ.. క్షేత్ర స్థాయి నాయకులతో చర్చించి అధిష్ఠానం నిర్ణయం అమలు జరిగేలా చూస్తానన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:15 AM