Share News

జగన్‌ కోటకు బీటలు!

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:20 AM

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే కీలక నియోజకవర్గాల్లో కూటమి పాగా వేసింది. ముఖ్యంగా మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో 65 ఎంపీటీసీలకు గాను ఏకంగా 64 కూటమికి ఏకగ్రీవమయ్యాయి.

జగన్‌ కోటకు బీటలు!

  • కడప జిల్లాలో 23 జడ్పీటీసీల్లో కూటమి ఏకగ్రీవం

  • పులివెందులలో ఒక్కటి తప్ప అన్ని ఎంపీటీసీలూ కూటమికే

  • 3 జడ్పీటీసీలూ టీడీపీ ఖాతాలో

  • జగన్‌ మేనమామ ఇలాకాలో అన్నీ ఏకగ్రీవమే

  • పుంగనూరులో పెద్దిరెడ్డి కోటా బద్దలు

  • 69 ఎంపీటీసీ స్థానాల్లో 43 ఏకగ్రీవం

  • ఎన్నికలు జరక్కముందే టీడీపీకి పల్నాడు జడ్పీ

  • 28 జడ్పీటీసీల్లో 18 ఆ పార్టీకి ఏకగ్రీవం

  • పలు జిల్లాల్లో కూటమి హవా

  • 659 జడ్పీటీసీల్లో 77 ఏకగ్రీవం

  • 1976 ఎంపీటీసీలు కూడా..

  • బుజ్జగింపులతో దిగి వచ్చిన నేతలు

  • నామినేషన్లు వెనక్కి తీసుకున్న వైనం

  • అయినా.. కొన్ని చోట్ల బరిలో రెబల్స్‌

  • మిగిలిన స్థానాలకు 3న పోలింగ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే కీలక నియోజకవర్గాల్లో కూటమి పాగా వేసింది. ముఖ్యంగా మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో 65 ఎంపీటీసీలకు గాను ఏకంగా 64 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. ఒక్క స్థానానికి మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆరు జడ్పీటీసీలకు గాను మూడు ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇక ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోటగా ఉన్న పుంగనూరులోనూ పోరు ఏకపక్షంగా మారింది. ఈ నియోజకవర్గంలోని 69 ఎంపీటీసీ స్థానాల్లో 43 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. ఆరు జడ్పీటీసీలకు మాత్రం ఎన్నికలు జరుగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పార్టీల హవా స్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం దక్కించుకున్నారు. రెబల్స్‌ను నాయకులు బుజ్జగించడంతో చాలా మంది ఉపసంహరించుకున్నారు. దీంతో ఏకగ్రీవాలు సాకారమయ్యాయి. అయినా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు ససేమిరా అనడంతో కూటమి పార్టీలకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు. రాష్ట్రంలో 28 జిల్లాల్లో మొత్తం 659 జడ్పీటీసీలు, 9829 ఎంపీటీసీలు ఉన్నాయి. వీటిలో 77 జడ్పీటీసీల్లో, 1830 ఎంపీటీసీల్లో ఏకగ్రీవాలు జరిగాయి. మిగిలిన స్థానాలకు 3న పోలింగ్‌ జరుగనుంది. 5న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.


పులివెందులలో కూటమి ఊచకోత

నిన్నమొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికలైనా.. స్థానిక ఎన్నికలైనా కడప జిల్లా వైఎస్‌ కుటుంబానికి పెట్టని కోటలా ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఈ కంచుకోట బద్దలైపోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ కూటమి వన్‌సైడ్‌గా ఊచకోత కోసింది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు 9 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలున్నాయి. వాటిలో 6 చైర్‌పర్సన్‌ స్థానాలను ఇప్పటికే కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. పులివెందుల నియోజకవర్గంలో 7 జడ్పీటీసీలకు గాను మూడు టీడీపీ ఖాతాలో ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలోనూ 40 వార్డులకు గాను 20 వార్డులు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీలు ఉండగా.. ఏకంగా 64 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. ఇందులో బీజేపీ రెండు చోట్ల ఎన్నిక కాగా.. మిగతావన్నీ టీడీపీ ఖాతాలో పడ్డాయి.

ఒక్క స్థానానికి మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. జగన్‌ మేనమామ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి నియోజకవర్గం కమలాపురం మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల స్థానాలన్నీ కూటమికి ఏకగ్రీవమయ్యాయి. నియోజకవర్గంలోని మొత్తం 6 జడ్పీటీసీలు, 47 ఎంపీటీసీల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థులు పోటీలేకుండానే ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలుంటే 23 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. అందులో 19 టీడీపీ, 3 బీజేపీ, ఒకటి జనసేన ఖాతాలో పడ్డాయి. మిగతావాటిలో కలసపాడు జడ్పీటీసీ స్థానానికి జనసేన నుంచి భవనాశి పద్మావతి బరిలో ఉండగా.. టీడీపీకి చెందిన పామూరి లక్ష్మీదేవి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇక్కడ వైసీపీ నుంచి అన్నారెడ్డి శ్రీలత కూడా పోటీచేస్తున్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవవర్గాల్లో మొత్తం 158 ఎంపీటీసీ స్థానాలుండగా 130 కూటమికి ఏకగ్రీవమయ్యాయి.

ఇందులో 113 టీడీపీ, 10 జనసేన, 7 బీజేపీ ఖాతాలో పడ్డాయి. బద్వేలులో మొత్తం 59 ఎంపీటీసీలు ఉండగా 57 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వైసీపీకి 8 దక్కగా.. మిగతావి కూటమి ఖాతాలో పడ్డాయి. మిగతా రెండు చోట్ల మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. రాజంపేట నియోజకవర్గంలో 68 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీడీపీ 24, జనసేన 4 కైవసం చేసుకున్నాయి. మిగతా 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


పెద్దిరెడ్డికి గట్టి షాకే..

అన్నమయ్య జిల్లాలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట పుంగనూరు కూడా బీటలు వారింది. ఈ నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణం, రూరల్‌ మండలం, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలు అన్నమయ్య జిల్లాలో చేరగా.. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. గత స్థానిక ఎన్నికల్లో ఆరు మండలాల్లో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. తాజా ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. పలమనేరు ఎమ్మెల్యే ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి మధుసూదన్‌నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సత్తా చాటింది. ఇప్పటికే పుంగనూరు మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానంతో 32 కౌన్సిలర్‌ స్థానాలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. నియోజవర్గంలో 69 స్థానాలకు గానూ కూటమి పార్టీలు 43 ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకుంది. ఆరు జడ్పీటీసీల్లో మాత్రం పోటీ నెలకొంది.

పల్నాడు తొలి జడ్పీపై కూటమి జెండా

పల్నాడు జిల్లాలోని 28 జడ్పీటీసీలకు 18 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో పల్నాడు జిల్లా పరిషత్‌ తొలి పీఠాన్ని ఎన్నికలకు ముందే కూటమి దక్కించుకున్నట్లయింది. పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మూడు చోట్ల జనసేన, ఏడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం కోసం నలుగురు పోటీ పడుతుండగా.. నల్లపాటి కీర్తన చౌదరి(పెదకూరపాడు), కొండపల్లి శివకుమారి (కారంపూడి) జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా విజయం సాధించారు.

అనంతలోనూ భారీగా ఏకగ్రీవాలు

అనంతపురం జిల్లాలో 450 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కూటమి 94.. సీపీఐ, వైసీపీ, ఇండిపెండెంట్‌ తలో ఒక చోట ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా 91 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఇక జిల్లాలోని 31 జడ్పీటీసీ స్థానాల్లో మూడింటిని టీడీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి స్థానాలు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 32 జడ్పీటీసీలకూ ఎన్నికలు జరగనున్నాయి. 397 ఎంపీటీసీ స్థానాలకు గాను 20 ఏకగ్రీవమయ్యాయి.


బాపట్ల జిల్లాలో ఒక జడ్పీటీసీ ఏకగ్రీవం

బాపట్ల జిల్లాలో 20 జడ్పీటీసీలు ఉండగా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని పిట్టలవానిపాలెం స్థానం ఏకగీవ్రంగా టీడీపీ ఖాతాలో పడింది. మిగిలిన 19 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చీరాల జడ్పీటీసీ స్థానం బీజేపీకి కేటాయించగా ఇక్కడ టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన వరదరాజులు బాలకృష్ణ రెబల్‌గా బరిలో నిలిచారు. జిల్లాలో 300 ఎంపీటీసీ స్థానాలకు 27 ఏకగ్రీవం కాగా ఇందులో టీడీపీ 24, జనసేన ఖాతాలో 3 పడ్డాయి. ఇందులో నిజాంపట్నం మండలంలో 17 ఎంపీటీసీలకు 13 స్థానాలు ఏకగ్రీవమవడంతో ఎంపీపీగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కుమారుడు రాజీవ్‌ ఎన్నిక లాంఛనం కానుంది.

ఉమ్మడి కృష్ణా..

13 మంది కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఎన్టీఆర్‌ జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో 9 మంది ఉన్నారు.

పశ్చిమ గోదావరి..

జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలకు 67 మంది బరిలో ఉన్నారు. 371 ఎంపీటీసీలకు 27 ఏకగ్రీవమయ్యాయి.

బాపట్ల జిల్లా..

20 జడ్పీటీసీలు ఉండగా పిట్టలవానిపాలెంలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 19 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో 300 ఎంపీటీసీలకు 27 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ 24, జనసేన ఖాతాలో 3 పడ్డాయి. ఒక్క నిజాంపట్నం మండల పరిధిలోనే 13 స్థానాలు కూటమికి దక్కాయి. ఎంపీపీగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్‌ ఎన్నిక లాంఛనం కానుంది.

కర్నూలు జిల్లా..

432 ఎంపీటీసీ స్థానాల్లో 74 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ 54, వైసీపీ 19, బీజేపీకి 1 దక్కాయి. మిగిలిన 358 స్థానాల్లో పోలింగ్‌ జరుగనుంది.


నంద్యాల జిల్లా..

28 జడ్పీటీసీల్లో 7 చోట్ల టీడీపీ ఏకగ్రీవమైంది.

మార్కాపురం జిల్లా..

21 జడ్పీటీసీలకు గాను ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 274 ఎంపీటీసీలకు 216 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ 204 స్థానాల్లో, జనసేన 8, బీజేపీ 3, టీడీపీ సహకారంతో సీపీఎం ఒక స్థానంలో ఏకగ్రీవంగా గెలిచాయి.

ప్రకాశం..

జిల్లాలో 371 ఎంపీటీసీలకు 151 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వైసీపీకి 2 రాగా.. మిగతావి కూటమి ఖాతాలో చేరాయి. 27 జడ్పీటీసీలకు గాను రెండింటిని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.

తప్పని రెబల్స్‌ బెడద!

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి రెబల్స్‌ బెడద తప్పలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేటలో గండ్రాయి మాజీ ఎంపీటీసీ ఆళ్ల వెంకన్న రెబల్‌గా బరిలోకి దిగారు. ఇక్కడ జనసేన తరపున కోసూరి ప్రహ్లాద్‌కు బీఫారం ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం జడ్పీటీసీ స్థానాల్లో కూటమి పార్టీలకు చెందిన రెబెల్స్‌ పోటీలో ఉన్నారు. బలిజిపేట స్థానాన్ని జనసేనకు కేటాయించినా టీడీపీ నాయకురాలు దుర్గేశ్వరి బరిలో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం జనసేనకు కేటాయించగా టీడీపీ నేత పాడి సుదర్శనరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. వీరఘట్టం జడ్పీటీసీ జనసేనకు కేటాయించినా ఇక్కడ జనసేన, బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 04:20 AM