జగన్ అక్రమాస్తుల కేసుల్లో..కాస్త కదలిక
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:33 AM
మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రత్యేక కోర్టు విచారణలో కాస్త వేగం పెరిగింది. దశాబ్ద కాలంగా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ క్రమంగా ముగుస్తోంది.
డిశ్చార్జ్ పిటిషన్ల దశ నుంచి అసలు విచారణ వైపు!
45 డిశ్చార్జ్ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు పూర్తి
ఇండియా సిమెంట్స్ కేసులో ముగిసిన వాదనలు
భారతి సిమెంట్స్ కేసులో విచారణ ప్రారంభం
ఆ 45 పిటిషన్లలో ప్రత్యేక కోర్టు తీర్పుపై ఆసక్తి
ఆ తర్వాతే నిందితులపై అభియోగాల నమోదు
జగన్‌పై మొత్తం 11 సీబీఐ, 9 ఈడీ చార్జిషీట్లు
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రత్యేక కోర్టు విచారణలో కాస్త వేగం పెరిగింది. దశాబ్ద కాలంగా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ క్రమంగా ముగుస్తోంది. దీంతో అసలు కేసుల విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఇండియా సిమెంట్స్ కేసుకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. మరోవైపు భారతి సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఆరు కేసులకు సంబంధించి 45 డిశ్చార్జ్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు సీబీఐ ప్రత్యేక కోర్టులో పూర్తయ్యాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ మొదలైంది. జగన్‌తో పాటు సహనిందితులు విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పుడు వాదనలు ముగిశాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు వీటిపై తీర్పు ప్రకటించిన తర్వాత ఎవరెవరి డిశ్చార్జ్ పిటిషన్లకు అనుమతి లభిస్తుంది.. ఎవరెవరికి కేసుల నుంచి విముక్తి కలుగుతుందో స్పష్టత వస్తుంది. ఈ పిటిషన్లపై కోర్టు తీర్పు తర్వాతే నిందితులపై అభియోగాల నమోదు, సాక్షుల విచారణ తదుపరి ప్రక్రియలకు మార్గం సుగమమవుతుంది. దీంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైకోర్టులో ఈడీ పిటిషన్‌తో..
సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీ విచారించాలని ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్టోబరు 14న నాంపల్లి సీబీఐ కోర్టు.. అటు సీబీఐ, ఇటు ఈడీ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించాలని నిర్ణయం తీసుకుంది. 2004-09 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వపరంగా ప్రయోజనాలు కల్పించారని, దీనికి ప్రతిఫలంగా జగన్, ఆయన కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని సీబీఐ ఆరోపించింది. ఈ వ్యవహరాన్ని క్విడ్ ప్రొకోగా పేర్కొంటూ లోతుగా దర్యాప్తు చేసి.. 11 కేసుల్లో చార్జిషీట్లు కూడా కోర్టులో దాఖలు చేసింది.
ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ టెక్‌జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, వాన్‌పిక్, రాంకీ, ఇండియా, దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులను పరిశీలించారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాలో వచ్చిన పెట్టుబడులు, షెల్ కంపెనీల మనీ రూటింగ్ కోణాన్ని పరిశీలించి మొత్తం 9 చార్జిషీట్లు వేశారు. ఇటీవల వారు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో.. సీబీఐ కేసులకు సంబంధించి 86 డిశ్చార్జ్ పిటిషన్లు, ఈడీ కేసులకు సంబంధించి 55 డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం 141 వ్యాజ్యాలు ప్రత్యేక కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రస్తుతం 45 డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తయింది. మిగతావాటిపైనా విచారణకు ముందడుగు పడడంతో తదుపరి దశపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!