జగన్ ‘ఆట’..కట్టు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:05 AM
మెగా డీఎస్సీ విషయంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించి మాజీ ముఖ్యమంత్రి జగన్ తానే అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి ఆయన అనేక ఆరోపణలు చేశారు.
మెగా డీఎస్సీపై చెప్పినవన్నీ అబద్ధాలే
కేవలం ఇంటర్ కాలేజీ పార్టిసిపేషన్‌తో క్రీడా కోటాలో పోస్టులిచ్చింది జగన్ సర్కారే
సచివాలయాలకు ఇలాగే ఉద్యోగాల భర్తీ..కానీ, నెపం మాత్రం కూటమి ప్రభుత్వంపై
‘ఇంటర్’ను డీఎస్సీలో పరిగణించలేదు
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నవారే పరిగణనలోకి
గోల్డ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయలేదని కోర్టుకు స్వయంగా తెలిపిన దుర్గయ్య
మెడల్ వచ్చినా జాబ్ ఇవ్వలేదంటూ..పక్కన కూర్చోబెట్టుకుని జగన్ అవాకులు
శాశ్వత ఉద్యోగులకే ప్రశ్నల యాక్సెస్ విధులు
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తోనే ఉద్యోగాలు రావు
ఆ విషయం కాల్ లెటర్‌లోనే స్పష్టీకరణ
డీఎస్సీపై వాస్తవాలను వెల్లడించిన అజయ్ జైన్, కోన శశిధర్, ఎస్.భరణి
అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ విషయంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించి మాజీ ముఖ్యమంత్రి జగన్ తానే అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి ఆయన అనేక ఆరోపణలు చేశారు. పోలవరానికి చెందిన దుర్గయ్య అనే అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకుని, ఆయనకు స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. క్రీడల్లో కేవలం పాల్గొంటేనే(పార్టిసిపేషన్) ఉద్యోగాలిచ్చేశారని కొంత వెటకారంగా తనదైన శైలిలో విమర్శించారు. ఇంటర్ కాలేజీ పోటీల్లో ఉన్నవారికీ ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. తీరా చూస్తే, సాయంత్రానికే అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. తన ప్రభుత్వంలో సచివాలయాల ఉద్యోగాల్లో అమలుచేసిన క్రీడా పాలసీని మర్చిపోయిన జగన్... కూటమి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు. క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ ఎస్.భరణి గురువారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం తరఫున వాస్తవాలను వివరించారు.
జగన్: ఇంటర్ కాలేజీ క్రీడా పోటీల్లో పాల్గొంటే ఉద్యోగాలిస్తారా? మెడల్స్ వచ్చిన వారికి ఇవ్వకుండా, కేవలం పాల్గొంటే ఉద్యోగాలు ఎలా ఇస్తారు?
ప్రభుత్వం: క్రీడా పాలసీకి సంబంధించి జీవో 4ను ప్రభుత్వం మెగా డీఎస్సీలో అమలుచేసింది. ఇంటర్ కాలేజీ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారిని పరిగణనలోకే తీసుకోలేదు. దానికి ముందు 2012లో తెచ్చిన జీవో 74... 2024 వరకు అమల్లో ఉంది. ఆ జీవో ప్రకారం ఇంటర్ కాలేజీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు, మహిళా స్పోర్ట్స్ ఫెస్టివల్స్ లాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. కానీ కొత్త పాలసీ ప్రకారం మెగా డీఎస్సీలో ఈ పోటీల్లో పాల్గొన్నవారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్‌షిప్ వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం.
జగన్: టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే కూన రవికుమార్ సర్టిఫికెట్లు ఇచ్చినవారికే ఉద్యోగాలిచ్చారు.
ప్రభుత్వం: క్రీడా కోటా కింద మెగా డీఎస్సీలో మొత్తం 382 ఉద్యోగాలు భర్తీ చేస్తే... వాటిలో 2025లో సర్టిఫికెట్లు జారీచేసినవి చాలా తక్కువ. వర్సిటీల స్థాయిలో 2025లో సర్టిఫికెట్లు జారీచేసిన వారిలో ఇద్దరినే పరిగణనలోకి తీసుకున్నాం. జూడో గేమ్‌లో 2025-26లో సర్టిఫికెట్లు పొందినవారిలో ఒక్కరినే పరిగణనలోకి తీసుకున్నాం. సాఫ్ట్‌బాల్‌లో 2025-26లో సర్టిఫికెట్లు పొందినవారు ఒక్కరూ డీఎస్సీలోకి రాలేదు. మొత్తంగా ఇటీవల సర్టిఫికెట్లు పొందిన వారిలో తొమ్మిది మందిని మాత్రమే డీఎస్సీ ఉద్యోగాల్లో పరిగణనలోకి తీసుకున్నాం.
జగన్: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ ఉన్న వ్యక్తి సిల్వర్ మెడల్ అని ఎందుకు పెడతాడయ్యా?
ప్రభుత్వం: దుర్గయ్య జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అనేది నిజమే. అయితే డీఎస్సీ నిబంధనల్లో వారు సాధించిన పతకాల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టంగా ఉంది. కానీ దుర్గయ్య అప్‌లోడ్ చేయలేదు. కోర్టును ఆశ్రయించిన ఆయన తన అఫిడవిట్‌లో 32వ నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయడంలో విఫలమయ్యానని, అప్‌లోడ్ చేయలేదని అంగీకరించారు. సర్టిఫికెట్ తప్పుగా అప్‌లోడ్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయనకు ఉద్యోగమిస్తే వేరే అభ్యర్థులు కోర్టుకు వెళ్లరా?
జగన్: మెడల్స్ సాధించడం కాకుండా, కేవలం క్రీడల్లో పాల్గొంటేనే ఉద్యోగాలిచ్చేశారు.
ప్రభుత్వం: వివిధ గేమ్స్‌లో పాల్గొంటేనే ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలనే పాలసీ జీవో 74 ద్వారా వచ్చింది. ఆ జీవో ప్రకారం 2019లో గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్‌లో అప్పటి ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు ఇచ్చేసింది. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో చూస్తే... జూనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 24 మందికి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పార్టిసిపెంట్లు 66 మందికి, సీనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 85 మందికి, రూరల్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 12 మందికి, మహిళా స్పోర్ట్స్ ఫెస్టివల్ పార్టిసిపెంట్లు ముగ్గురికి, ఇంటర్ కాలేజీ పార్టిసిపెంట్లు ఇద్దరికి ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉద్యోగాలిచ్చారు.
జగన్: మా ప్రభుత్వంలో 6,100 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వాటిని రద్దుచేసి, టీచర్ల భర్తీని ఆలస్యం చేసింది.
ప్రభుత్వం: గత ప్రభుత్వంలో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయలేదు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ నోటిఫికేషన్‌లో దానిని పెట్టలేదు. ఈ అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, స్టే వచ్చింది. దీంతో ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించి, 6,100 పోస్టులు రద్దుచేసి, కొత్తగా 16,347 పోస్టులకు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీచేసింది.
జగన్: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రాల అప్‌లోడ్ బాధ్యత అప్పగించారు.
ప్రభుత్వం: ఇది అవాస్తవం. అన్ని సబ్జెక్టులకు కలిపి 42వేల ప్రశ్నలు తయారుచేశాం. వాటిని ‘టీసీఎస్ అయాన్’ ప్లాట్‌ఫాం ద్వారా అప్‌లోడ్ చేశాం. ఆ బాధ్యతను ఇద్దరు శాశ్వత ఉద్యోగులకు అప్పగించాం. వారిద్దరికి మాత్రమే ఆ ప్రశ్నలు యాక్సెస్ చేసే అధికారం ఉంది. ‘టీసీఎస్ అయాన్’ను 20 రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కోర్టులు వినియోగిస్తున్నాయి. ఇందులో లీకేజీకి ఆస్కారమే లేదు. శాశ్వత ఉద్యోగులిద్దరే రోజూ పాస్‌వర్డ్‌లు మార్చారు. ప్రతి అభ్యర్థికీ ప్రశ్నలు జంబ్లింగ్ అయ్యాయి.
జగన్: పేపరు లీకు కాకపోతే నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
ప్రభుత్వం: ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేసిన ఉద్యోగి నవీన్‌కు సోషల్‌లో ఫస్ట్ ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు వచ్చింది. అతన్ని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. కానీ అతను హాజరుకాలేదు. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు రాకపోతే ఉద్యోగం ఇవ్వరు. ఆ అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. జరిగిన ప్రక్రియను న్యాయస్థానానికి వివరించాం. దీనిపై కోర్టు స్టే ఇవ్వలేదు. ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నది నిజమా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.
జగన్: కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సిన ఎంపికను కేంద్రీకృతం చేశారు.
ప్రభుత్వం: ఇది అవాస్తవం. కలెక్టర్ల పేరుతోనే అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కలెక్టర్లకు తెలియకుండా వారి సంతకాలతో ఆర్డర్లు ఎలా వస్తాయి? మెరిట్ జాబితాలు మొత్తం ఆన్‌లైన్‌లో ఉన్నాయి. టెట్ మార్కులు, డీఎస్సీ మార్కులు కూడా అందరూ చూసుకునేలా అందుబాటులో ఉన్నాయి. రిజెక్షన్ జాబితాలు పెట్టలేదు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ కూడా రిజెక్షన్ జాబితాలు పెట్టవు.
జగన్: పిలిచినవారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు
ప్రభుత్వం: సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్లు కాదు. అదే విషయం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కాల్ లెటర్‌లో స్పష్టంగా ఉంది. హారిజాంటల్ రిజర్వేషన్ విధానం వల్ల కొంతమందిని అదనంగా పరిశీలనకు పిలవాల్సి వచ్చింది. ఉదాహరణకు ఏకాంబరం అనే అభ్యర్థి కేసును పరిశీలిస్తే... ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ-డి కేటగిరీ అభ్యర్థి. ఆ జిల్లాలో ఏడు పోస్టులున్నాయి. 116 ర్యాంకు వరకు ఐదు పోస్టులు మెరిట్‌తో భర్తీ అయ్యాయి. ఏకాంబరానికి 125వ ర్యాంకు వచ్చింది. అయితే ఆయన కంటే ముందు బూసిరెడ్డి రవి అనే ఓసీ కేటగిరీ అభ్యర్థి, లక్ష్మణుడు అనే ఎస్సీ కేటగిరీ అభ్యర్థి పీహెచ్ కోటాలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చారు. వారు ఉద్యోగాలకు అర్హులు కారని తేలింది. దీంతో ఆ తర్వాతి పీహెచ్ అభ్యర్థులను పిలవగా వారిలో బీసీ-డి కేటగిరీ అభ్యర్థి ఉండటంతో ఏకాంబరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినప్పటికీ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
వారిని తీసుకోకపోతే ఇవి కూడా భర్తీ కావు
అజయ్ జైన్ మాట్లాడుతూ...‘కేవలం క్రీడల్లో పాల్గొన్న వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు’ అని అంటున్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారిని పరిగణనలోకి తీసుకోకపోతే ఈ పోస్టులు కూడా భర్తీ కావు. 421 పోస్టుల్లో భర్తీ అయింది 382 పోస్టులే. పార్టిసిపెంట్లను పరిగణనలోకి తీసుకోకపోతే ఇవి కూడా భర్తీ అయ్యేవి కావు. క్రీడా మెరిట్ సర్టిఫికెట్లను వాటిని జారీచేసిన క్రీడా సంఘాలకు పంపి ఒరిజినల్‌వే అని ధ్రువీకరించుకున్నాం’’ అని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని, ఈ క్రమంలో అభ్యర్థులు, నిరుద్యోగులు అపోహలకు గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కోరారు.