జగన్ బంటు ఆస్తి వెయ్యి కోట్లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:32 AM
అవినీతికి పాల్పడే అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులు సైతం అసూయ పడేలా జగన్ బంటు అక్రమాస్తులు కూడబెట్టారు.
2019లో వార్షికాదాయం 60 లక్షలు.. ఐదేళ్లలో అడ్డగోలుగా అక్రమార్జన
సీఎంగా ఉన్నప్పుడు సహాయకుడు
జీతభత్యాలు నెలకు రూ.1.5-2 లక్షలు
పైరవీలు, సెటిల్మెంట్లు, కమీషన్ల వసూళ్లు
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆస్తులు
లిక్కర్ స్కామ్‌ను కదిలిస్తే ఎక్కడెక్కడో లింకులు
బామ్మర్ది కంపెనీలో భార్య భాగస్వామి
ఇక్కడి అక్రమ సొమ్ము అమెరికాకు
అక్కడి నుంచి సక్రమంగా తిరిగి వెనక్కి
ఆ గుట్టంతా విప్పిన సిట్
పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన ఈడీ
పూర్వాశ్రమంలో ఆయన ఓ విలేకరి. నెల జీతం పాతికవేలు. జగన్ పార్టీ పెట్టాక ఆయన పంచన చేరారు. సహాయకుడిగా ఎదిగారు. 2019లో జగన్ సీఎం అయ్యాక కూడా కొనసాగించారు. ప్రభుత్వం నుంచి 1.5-2 లక్షలు జీతభత్యాలుగా చెల్లించారు. అదే ఏడాది జగన్ బంటు తన వార్షిక ఆదాయం రూ.64 లక్షలున్నట్టుగా ఐటీ రిటర్న్స్ చూపించారు. ఈ లెక్కన.. జగన్ హయాంలో ఐదేళ్లలో ఆయన బంటు ఎంత సంపాదించి ఉండొచ్చు? ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? ఎవరూ కలలో కూడా ఊహించనంతగా పోగేశారు! మార్కెట్‌లో అతడి ఆస్తుల విలువ అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలు! వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ విచారణలో ఎక్కడెక్కడివో లింకులు బయటపడ్డాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడే అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులు సైతం అసూయ పడేలా జగన్ బంటు అక్రమాస్తులు కూడబెట్టారు. వైసీపీ హయాంలో కేవలం ఐదేళ్లలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌లలో వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్లుపైనే ఉంటుంది.
దర్యాప్తు సంస్థలు ఈ మేరకు ఒక అంచనాకు వచ్చాయి. జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో లింకులు పట్టుకొంటూ వెళితే.. అవి దేశ సరిహద్దులు దాటుతున్నాయి. సిట్ విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇక్కడే జగన్ బంటు బాగోతం బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒకప్పుడు కడప జిల్లాలో పాతిక వేల జీతంతో విలేకరిగా పనిచేసిన వ్యక్తి జగన్ వద్ద సహాయకుడిగా చేరారు.
2019 నాటికి వార్షిక ఆదాయం 64 లక్షలుగా చూపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా ఆయన దశ మారిపోయింది. వందల కోట్ల రూపాయలు ఆర్జించి దేశ, విదేశాల్లో భారీగా ఆస్తులు సంపాదించారు. అక్రమంగా సంపాదించిన వాటిని సక్రమమైనవిగా చూపించుకోవడానికి బామ్మర్దితో జత చేరి కన్నింగ్ ప్లాన్ వేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేయించి, దేశంలో బ్రాంచ్(హైదరాబాద్) పెట్టించారు. అందులో తన భార్యను భాగస్వామిగా చేర్చారు.
బామ్మర్దికి అక్రమ మార్గంలో చేరిన సొమ్మును వ్యాపారంలో లాభంగా చూపించి వెనక్కి పంపించమన్నారు. అలా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఇందులో ఎక్కువగా పైరవీలు, సెటిల్మెంట్లకు సంబంధించిన డబ్బుతో పాటు కమీషన్ల వసూళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సిట్ దర్యాప్తులో వెలుగులోకి
రాష్ట్రంలో 2024లో ప్రభుత్వం మారడంతో మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్కామ్‌లో కూపీ లాగడంతో ఎక్కడెక్కడి మూలాలో వెలుగులోకి వచ్చాయి. మాజీ సీఎం జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకోవడం, వైసీపీ లిక్కర్ ముఠా మూడున్నర వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోచుకుందో బట్టబయలైంది. ఇదే సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(లిక్కర్ స్కామ్‌లో నిందితుడు) తిరుపతికి సమీపంలోని కేవీఆర్ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన వెంచర్‌లో జగన్ బంటు రూ.80లక్షలకు పదెకరాలు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
సిట్ చెవిరెడ్డి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఆధారాలు లభించాయి. అక్కడ ఎకరం భూమి ప్రభుత్వ విలువ రూ.35 లక్షలు ఉందని, ఆ పదెకరాల ఆస్తి విలువ రూ.35 కోట్లు అని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఆ వివరాలు తెలుసు కోవడానికి జగన్ బంటును పిలిచి విజయవాడలో ప్రశ్నించింది. తన భార్య బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ ద్వారా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ‘2019కు ముందు మీ ఆదాయం 64 లక్షలకు లోపే ఉన్నట్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖల్లో ఉంది. మీ భార్యకు బంగారం కొనుగోలు చేసినట్లు ఎక్కడా రికార్డుల్లో లేదేం’ అని సిట్ అధికారులు ప్రశ్నించారు. తన బామ్మర్ది అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశారని, అందులో తన భార్యకు భాగస్వామ్యం ఉందని, ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినట్లు జగన్ బంటు వెల్లడించారు.
ఆ వివరాలు తీసుకుని పరిశీలించగా అక్రమ సొమ్ము రూటింగ్ కోసమే ఈ కంపెనీలో భాగస్వామిగా తన భార్యను బంటు చేర్చినట్లు సిట్ ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆఫీసు ఉన్నట్లు చూపించారు. కానీ అది జగన్ బంటు ఇల్లు. అక్కడ సిబ్బంది లేరు. కార్యకలాపాల్లేవ్. ఆర్డర్లు అంతకూ లేవు. విశాఖపట్నంలో రూ.250 కోట్ల విలువైన భూమి దగ్గరి నుంచి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పోగేసిన కోట్లాది రూపాయల ఆస్తులు బయట పడ్డాయి.
అడ్డగోలుగా కమీషన్లు
విశాఖలో ఎకరా రూ.32.67 కోట్ల చొప్పున జగన్ బంటు భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే చెల్లించింది మాత్రం రూ.12.50 కోట్లే. అందులోనూ ఐదు కోట్లు బామ్మర్ది పంపగా, మరో 3.5 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. ఎవరు అప్పు ఇచ్చారని అధికారులు ప్రశ్నించగా.. స్నేహితులు అని సమాధానం చెప్పారు. కానీ ఐటీ రిటర్న్స్‌లో ఎక్కడా లేదు. పలు ఖాతాల నుంచి అమెరికాలోని బామ్మర్ది కంపెనీ ఖాతాల్లోకి రూ.19.80 కోట్లకు పైగా బదిలీ అయినట్లు బయట పడింది.
ఆ డబ్బు బదిలీ చేసిన వ్యక్తులు, సంస్థల వివరాలు తీసుకుని వారిని సిట్ అధికారులు ప్రశ్నించారు. తమకు ఏవేవో పనులు చేసి పెట్టినందుకు బంటుకు లంచం ఇచ్చామని చెప్పారు. వారిలో రియల్టర్లు, నెల్లూరు జిల్లాకు చెందిన మైనింగ్ వ్యాపారి, విజయవాడకు చెందిన కార్ల షోరూమ్ యజమాని, హైదరాబాద్‌లో బ్రాండెడ్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్న మరో వ్యాపారి ఉన్నారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అందరి నుంచి ఒకటే సమాధానం వచ్చింది. ‘సీఎం బంటు మాకు పని చేసి పెట్టారు.. మేం ఆయనకు ప్రతిఫలం చెల్లించాం’ అని వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో స్థిరాస్తులు, అమెరికా కంపెనీలో భాగస్వామ్యం, బంటు కొనుగోలు చేసినట్లు చెబుతున్న బంగారం అన్నీ కలిపితే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని సిట్ అధికారులు అంచనా వేశారు. మద్యం ముడుపులు తీసుకున్నట్లు పక్కా ఆధారాలు తమకు లభించాల్సి ఉందని, ఇప్పటి వరకూ వెల్లడైన వాటిలో విజయవాడకు చెందిన పుస్తకాల వ్యాపారి నుంచి నెల్లూరులో మైన్ అక్రమంగా తవ్వించి చెన్నైకి తీసుకెళ్లే వ్యక్తి వరకూ పలువురి పాత్ర ఉన్నట్లు సిట్ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం నుంచి ఐదేళ్ల పాటు జీతం తీసుకున్నందున బంటుపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారించేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు.
బంటు బాగోతం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తెలిసింది. ‘మీరు తప్పుకోండి మేం రంగంలోకి దిగుతాం’ అంటూ ఈడీ ముందుకొచ్చింది. ‘ఇక్కడి నుంచి విదేశాలకు కోట్లాది రూపాయల నిధులు వెళ్లాయి. అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వచ్చాయి. మేం దీని సంగతి తేలుస్తాం’ అంటూ వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అతి త్వరలో ఈసీఐఆర్ నమోదు చేసి బంటును విచారించే అవకాశం ఉంది. ఇందులో కీలక పాత్ర పోషించిన మైనింగ్ వ్యాపారి(చెన్నైలో సెటిలైన నెల్లూరు వాసి), మరో సెల్ షాపుల యజమాని, బంటు బామ్మర్దికి సైతం నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం