Share News

ISRO మరో ఘన విజయం.. EOS-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం..

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:41 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది.

ISRO మరో ఘన విజయం.. EOS-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి వేకువజాము 2:55 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. భూమిని మరింత స్పష్టంగా, నిరంతరం పరిశీలించేందుకు EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.

isro1.jpg


51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు ఉన్న GSLV-F17 రాకెట్ నిర్ణీత సమయంలో నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం తర్వాత EOS-05 ఉపగ్రహాన్ని నిర్దేశించిన సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (Sub-GTO)లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో ఉపగ్రహం తన తదుపరి కక్ష్య ప్రయాణాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. EOS-05ను భారతదేశపు తొలి జియోసింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ శాటిలైట్‌గా పేర్కొంటున్నారు.

isro2.jpg


EOS-05 ప్రత్యేకతలివే..

భూమికి దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య నుంచి భూభాగాలను నిరంతరం పరిశీలించడం ఈ ఉపగ్రహం ప్రధాన ప్రత్యేకత. అలాగే శత్రు దేశాల కదలికలను గుర్తించడంతో పాటూ సరిహద్దుల పర్యవేక్షణలో ఈ శాటిలైట్ కీలకం కానుంది. ఈ ఉపగ్రహం ఒకే ఫ్రేమ్‌లో దక్షిణాసియాను మొత్తం ఫొటో తీయగలదు. భారత ఉపఖండం మొత్తాన్నీ కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపించగలదు. జియో కక్ష్యలో ఇలాంటి అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాతో ఉన్న ఉపగ్రహం.. ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇస్రోకు ఉన్న సామర్థ్యంతో పోలిస్తే.. ఈ ఉపగ్రహం కెమెరా పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉండడం విశేషం. ఈ సాంకేతికతతో వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ పరిస్థితులు, అడవులు, నీటి వనరులు, పర్యావరణ మార్పులను సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరదలు, తుపాన్లు, కరువు వంటి విపత్తుల సమయంలో సమాచారం వేగంగా అందించడంలో ఇది కీలకంగా మారనుంది. దేశ భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ సామర్థ్యాలను కూడా ఈ ఉపగ్రహం మరింత బలోపేతం చేయనుంది.

isro3.jpg


GSLVకు 19వ మిషన్

GSLV-F17 విజయవంతమైన ప్రయోగంతో GSLV వాహక నౌకల శ్రేణి 19వ మిషన్‌ను పూర్తి చేసింది. ఈ విజయంతో భారతదేశ ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. అంతరిక్ష ప్రయోగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి EOS-05 ప్రయోగం మరో మైలురాయిగా నిలిచింది. భూమి పరిశీలనలో మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా దేశ అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.

Updated Date - Sep 04 , 2026 | 07:57 AM