తాడేపల్లి ఐఓసీఎల్ ప్లాంట్ మూత!
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:45 AM
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... గత 30 ఏళ్లుగా లూబ్రికెంట్ ఆయిల్ తయారీ
400 కుటుంబాలకు జీవనాధారం
దేశంలో ఉన్న 8 ప్లాంట్లలో ఇది ఒకటి
ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
తాడేపల్లి టౌన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిలోని పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్లాంట్‌ను 1995లో ప్రారంభించారు. దాదాపు 30 ఏళ్లుగా లూబ్రికెంట్ ఆయిల్ తయారీలో ఈ ప్లాంట్ కీలకంగా పనిచేసింది. దేశంలో ఉన్న ఇలాంటి 8 ప్లాంట్లలో ఇది ఒకటి. దేశవ్యాప్త లూబ్రికెంట్ డిమాండ్‌లో 35 శాతాన్ని ఈ ప్లాంట్ ఒక్కటే తీరుస్తోంది.
నెలకు 3 వేల కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు లూబ్రికెంట్ ఆయిల్‌ను సరఫరా చేస్తోంది. దేశంలోనే రెండవ అత్యంత చవకైన ఉత్పత్తి యూనిట్‌గా ఖ్యాతి గడించింది. బేస్ ఆయిల్‌ను ఎల్బీపీ, సీపీసీఎల్ నుంచి ట్రక్కుల ద్వారా దిగుమతి చేసుకుని.. ముంబై, చెన్నై నుంచి యాడిటివ్స్ తెప్పించి 17 రకాల గ్రేడ్ల లూబ్రికెంట్ ఆయిల్‌ను ఇక్కడ బ్లెండ్ చేస్తారు. అనంతరం అర లీటర్ నుంచి 50 లీటర్ల క్యాన్లు, 210 లీటర్ల బారెల్స్‌లో నింపి మార్కెట్‌కు పంపిస్తారు.
స్థలాభావంతోనే మూసివేత నిర్ణయం!
పాతబడిన మౌలిక సదుపాయాలు, స్థలాభావం, ఆధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయడం కష్టం కావడంతో ఈ ప్లాంట్ మూసివేతకు ఈ ఏడాది మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్‌పై ఆధారపడి దాదాపు 400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రత్యక్షంగా 200 కుటుంబాలు(కాంట్రాక్టు కార్మికులు, లోడింగ్/అన్ లోడింగ్, ఫిల్లింగ్ ఆపరేటర్లు), పరోక్షంగా 200 కుటుంబాలు (రవాణా, భద్రత, ఇతర సేవలు) వీటిలో ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికులే. చాలా మంది వయసు 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
భద్రతా సిబ్బంది (డీజీఆర్ ద్వారా నియమితులైన మాజీ సైనికులు) సుమారు 20 మందితోపాటు, కాంట్రాక్టు సిబ్బంది 100 మందికిపైగా ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఎక్కువ మంది కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ విధానంలోనే పని చేస్తున్నారు. ప్లాంట్ మూసివేతతో వీరి ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కాంట్రాక్టు కార్మికులకు పరిహారం ఇస్తామని, భద్రతా సిబ్బందిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్) ద్వారా తిరిగి నియమిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి: