సీబీజీ ప్లాంట్ భూమిలో అక్రమ మైనింగ్
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:46 AM
ఏలూరు జిల్లా తోటపల్లి గ్రామం పరిధిలో కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరుపుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.
హైకోర్టులో పిల్... ప్రతివాదులకు నోటీసులు జారీ
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా తోటపల్లి గ్రామం పరిధిలో కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరుపుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు జిల్లాలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరుపుతున్నారని ఆరోపిస్తూ ఆగిరిపల్లి మండలం, ఈదులగూడెం గ్రామానికి చెందిన ఎలప్రోలు వెంకట సుబ్బయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ప్లాంట్ ఏర్పాటు కోసం న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ)కు చేసిన భూ కేటాయింపును రద్దుచేసి, తిరిగి స్వాధీనం చేసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రావెల్ అక్రమ మైనింగ్, విక్రయం ద్వారా ఆర్జించిన సొమ్మును లెక్కించి బాధ్యుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కోరారు. సీబీజీ ప్లాంట్ ఏర్పాటుపై గ్రామస్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదంటూ తప్పుడు నివేదికలు సృష్టించి పొందిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరారు. అక్రమ మైనింగ్, భారీ వాహనాలు తిరగడంతో తోటపల్లి, పోతవరప్పాడు, నరసింగాపాలెం, చిన్న ఆగిరిపల్లి తదితర గ్రామాల రోడ్లు ధ్వంసమయ్యాయని, కాలువలు, వాగులు పూడ్చడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు