పంచాయతీ.. రాజ్‌కు వెయ్యేళ్లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:23 AM
పంచాయతీరాజ్ గ్రామ స్వరాజ్యం సాధనకు ఏర్పడిన వ్యవస్థ. ఆ పేరుకు తగినట్టే రాజుల కాలం నుంచీ ఈ భావన ఉనికిలో ఉంది. గ్రామంలోని పెద్దలు, గౌరవనీయులు కలిసి గ్రామ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో మొదలై....
రాజుల కాలంలోనే గ్రామ సభలు
స్వాతంత్య్రానంతరం ప్రజల చేతికే పాలన
తొలి ప్రజాస్వామ్య భావనలకు గ్రామాల్లో బీజం
అంచెలంచెలుగా కొనసాగిన చరిత్ర
మొదట్లో గ్రామ పెద్దలే శాసనాధికారులు
ప్రజలనే ప్రభువులను చేసిన గ్రామ స్వరాజ్యం
ఆ ఆదర్శాన్ని బలపరిచిన ఎన్నికల వ్యవస్థ
ఈ క్రమంలో ఎన్నో మలుపులు, మార్పులు
(అమరావతి, ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ గ్రామ స్వరాజ్యం సాధనకు ఏర్పడిన వ్యవస్థ. ఆ పేరుకు తగినట్టే రాజుల కాలం నుంచీ ఈ భావన ఉనికిలో ఉంది. గ్రామంలోని పెద్దలు, గౌరవనీయులు కలిసి గ్రామ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో మొదలై. ప్రజలే ప్రభువులుగా మారి, ఎన్నికల ద్వారా గ్రామ పాలన చేసుకునేదాకా.. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఈ వ్యవస్థ ఉంది. ఆ తొలి రోజుల్లో.. భూములు, నీటి వనరులు, గ్రామ ఉమ్మడి ఆస్తుల నిర్వహణ, చిన్నచిన్న వివాదాల పరిష్కారం వంటి బాధ్యతలను గ్రామసభలు చూసుకునేవి. ఐదుగురు పెద్దలతో ఏర్పడే పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉండేది. దక్షిణ భారతదేశంలోని చోళుల కాలంలోనూ గ్రామ సభలు ఎంతో చురుగ్గా పనిచేశాయి.
తమిళనాడులోని ఉత్తరమేరూరు శాసనాలు అప్పటి గ్రామ సభల ఎన్నికలు, సభ్యుల అర్హతలు, బాధ్యతల గురించి వివరించాయి. బ్రిటీష్ పాలనలో కొత్త రెవెన్యూ, న్యాయ, పరిపాలనా వ్యవస్థలు రావడంతో గ్రామ పంచాయతీల ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. గ్రామాల్లోనే పరిష్కారమయ్యే అనేక సమస్యలు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే స్థానిక పాలనకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన బ్రిటిష్ పాలకుల్లోనూ మొదలైంది. 1870 అప్పటి వైస్రా య్ లార్డ్ మేయో స్థానిక సంస్థలకు కొన్ని ఆర్థిక పరిపాలనా బాధ్యతలు అప్పగించే దిశగా తీర్మా నం చేశారు. 1882లో మరో కీలక అడుగు పడింది.
లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన తీర్మానాన్ని తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. అందుకే ఆయనను భారతదేశ స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పిలుస్తారు. 1907లో హాబ్‌హౌ స్ అధ్యక్షతన ఏర్పాటైన వికేంద్రీకరణ కమిషన్ గ్రామ పంచాయతీలను తిరిగి బలోపేతం చేయాలని సిఫారసు చేసింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలన అంశం ప్రావిన్సుల పరిధిలోకి వెళ్లింది. 1935 చట్టంతో రాష్ట్రాలకు మరింత అధికారా లు వచ్చాయి. అయినప్పటికీ గ్రామ పంచాయతీలకు నిధులు, స్వతంత్ర అధికారాలు పరిమితంగా ఉండేవి.
స్వాతంత్య్రం తర్వాత...
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గ్రామాలే అభివృద్ధికి కేంద్రంగా ఉండాలన్న ఆలోచన బలపడింది. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం చర్చకు వచ్చింది. ప్రతి గ్రామం తన అవసరాలను తానే గుర్తించి, తన అభివృద్ధికి తానే నిర్ణయాలు తీసుకోవాలనేది ఆ ఆలోచనలోని ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణం గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసి, వాటికి స్వపరిపాలనకు అవసరమైన అధికారాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగపరమైన పునాది వేసింది.
అభివృద్ధి కార్యక్రమాలతో మొదలైన ప్రయోగం...
1952లో కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ డెవల్‌పమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో వ్యవసాయం, రహదారులు, విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి రంగాల్లో అభివృద్ధి సాధించడం దీని లక్ష్యం. 1953లో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమంలో కూడా ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గ్రామ స్థాయిలో ఎన్నికైన సంస్థల అవసరం గుర్తించారు.
మూడంచెల వ్యవస్థకు బాట....
1957లో బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికైన సంస్థలు ఉండాలని ఈ కమిటీ సూచించింది. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ప్రతిపాదించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1959లో రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఏడాది మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
73వ రాజ్యాంగ సవరణ....
1992లో పార్లమెంటు 73వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనిద్వారా రాజ్యాంగంలో తొమ్మిదో భాగం చేర్చారు. పంచాయతీలకు రాజ్యాంగబద్దమైన గుర్తింపు లభించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు కనీసం మూడో వంతు స్థానాలు కేటాయించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడం వంటి కీలక మార్పులు వచ్చాయి.
కాలక్రమంలో పంచాయతీల రూపం మారింది. ఒకప్పుడు గ్రామ పెద్దల నిర్ణయాలతో నడిచిన పాలన, ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామసభల ద్వారా సాగుతోంది. అయితే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే గ్రామ స్వరాజ్యం కాదు. గ్రామ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, వాటి అమలుకు నిధులు, పనులు, సిబ్బంది పంచాయతీ చేతిలో ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం నిజమవుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం