Share News

ఛీఛీ.. సాక్షి.. యాక్‌ ఛీ!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:39 AM

ఎరుపు రంగు చదరంలో ఉన్నది 1986లో ‘ఆంధ్రజ్యోతి’కి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. ఇందులో... హైవేను ఆనుకుని ఉన్న 74 సెంట్లను బఫర్‌ జోన్‌ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది......

ఛీఛీ.. సాక్షి.. యాక్‌ ఛీ!

‘ఆంధ్రజ్యోతి’కి భూ నజరానా అంటూ బురద కథనం

చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు

  • ఆదేశాలు, ఉత్తర్వులు, తీర్పులకు ముసుగేసి రాతలు

  • అది.. 1986లో ఎన్టీఆర్‌ హయాంలో ఇచ్చిన భూమి

  • అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరన్నర కేటాయింపు

  • అందులో.. 74 సెంట్లు హైవే బఫర్‌జోన్‌ కోసం వెనక్కి

  • ప్రత్యామ్నాయ స్థలం కోసం సుదీర్ఘ ఉత్తర ప్రత్యుత్తరాలు

  • 2017లో అదే స్థలానికి ఆనుకుని, అంతే భూ కేటాయింపు

  • దీనికోసం రూ.50 లక్షలు చెల్లించిన ‘ఆంధ్రజ్యోతి’

  • 2019లో జగన్‌ వచ్చీ రాగానే భూ కేటాయింపు రద్దు

  • చట్టప్రకారమే వెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

ఎరుపు రంగు చదరంలో ఉన్నది 1986లో ‘ఆంధ్రజ్యోతి’కి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. ఇందులో... హైవేను ఆనుకుని ఉన్న 74 సెంట్లను బఫర్‌ జోన్‌ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, 2017లో అంతే విస్తీర్ణంలో వెనుకవైపున 50సెంట్లు, పక్కన 24 సెంట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతే తప్ప... ఇది కొత్తగా జరిగిన కేటాయింపు కాదు. ఉచితంగా ఇచ్చిందీ కాదు.

‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపును రద్దు చేస్తూ 2019లో జగన్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగం. ‘అసంబద్ధమైన కారణాలతో, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఏ మాత్రం బుర్ర వాడకుండా ఆదేశాలు జారీ చేశారు’ అని హైకోర్టు ఇందులో స్పష్టం చేసింది.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని..అడ్డగోలుగా వేలకోట్లు వెనకేసుకుని..స్వభజన, పరనిందే లక్ష్యంగా చేసుకుని.. అధికారానికీ, అవినీతికీ పుట్టిన విష పుత్రిక ‘సాక్షి’!పేరుకే అది ‘సాక్షి’. కానీ, దాని తీరు ‘యాక్‌.. ఛీ’!పేరుకే అది ‘దిన పత్రిక’. నిజానికది జగన్‌ భజన పత్రిక!

2.jpg

కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో నిత్యం జనం మెదళ్లలో బురద నింపేందుకు... పెన్నులో సిరా బదులు విషం నింపుకొని రాసే కథనాలకు అది చిరునామా! అలాంటి ఒక కథనాన్నే ‘యాక్‌.. ఛీ’ పత్రిక మంగళవారం ప్రచురించింది. ‘ఆంధ్రజ్యోతికి భూ నజరానా’ అంటూ నిలువెల్లా విషం కక్కింది. నిజాలను నిస్సిగ్గుగా దాచేసింది. బాగా అలవాటైన అబద్ధాలను వండి వార్చింది. భూ కేటాయింపు తీరు, ‘ప్రత్యామ్నాయం’గా ఇచ్చిన స్థలం, కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు, ఆయా తేదీలు... ఇలా అన్ని అంశాల్లోనూ ‘యాక్‌ ఛీ’ అబద్ధాలే! తప్పుడు సమాచారం అందించి సొంత పాఠకులను పక్కదారి పట్టించింది. ‘ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు’ అంటూ సోమవారమే సోషల్‌ మీడియాలో ‘నీలి విషం’ చిమ్మారు. ఇక... రోత పత్రిక మంగళవారం మరింత రోతగా వాంతి చేసుకుంది. ‘ఆంధ్రజ్యోతి’ని అపఖ్యాతి పాలుచేయాలనే ఆత్రంతో తానే బురదలో కూరుకుపోయింది. కూటమి సర్కారు నిజంగానే ‘ఆంధ్రజ్యోతి’కి భూమిని నజరానాగా ఇచ్చిందా? దీనిపై ‘యాక్‌ ఛీ’ పత్రిక రాసిందేమిటి? అసలు వాస్తవాలు ఏమిటి?


రోత పత్రిక: ‘ఆంధ్రజ్యోతికి భూ నజరానా!

15 కోట్ల విలువైన భూమి కేటాయింపు!

అసలు నిజం: ‘ఆంధ్రజ్యోతి’కి చంద్రబాబు కొత్తగా భూ నజరానా ఇచ్చిందే మీ లేదు. 1986లోనే అంటే, జగన్మోహన్‌ రెడ్డి బడికి వెళ్లే వయసులో, నాడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి ఉండగా‘ఆంధ్రజ్యోతి’కి విశాఖలోని పరదేశీపాలెంలో 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. నాడు ఎకరం 10వేల చొప్పున మార్కెట్‌ విలువ చె ల్లించాకే భూమిని కేటాయించారు. అయితే, ఆ తర్వాతి క్రమంలో అదే భూమిలో 74 సెంట్ల ను జాతీయ రహదారి కోసం తీసేసుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి మిగిలింది 76సెంట్లు మాత్రమే. అది పత్రిక కార్యాలయ నిర్మాణ అవసరాలకు సరిపోయేంత విస్తీర్ణం కాదు. దీంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని, హైవే విస్తరణ (బఫర్‌ జోన్‌) కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన నాటి ప్రభుత్వం... 1986లో కేటాయించి, హైవేకోసం తీసుకోగా మిగిలిన 76 సెంట్లకు ఆనుకుని వెనుక వైపున 50 సెంట్లు, పక్కన 24 సెంట్లు కేటాయించింది. ఇది కూడా ఉచితంగా కాదు. ఆ రోజున్న మార్కెట్‌ (రిజిస్ట్రేషన్‌ బుక్‌ వ్యాల్యూ ప్రకారం) విలువ మేరకు రూ.50 లక్షలను ‘ఆంధ్రజ్యోతి’ చెల్లించింది. హైవే బఫర్‌ జోన్‌కోసం కోల్పోయిన భూమికి బదులుగా ఇస్తున్న భూమి కాబట్టి... కొత్తగా ధర చెల్లించాల్సిన అవసరం లేదని వాదించే అవకాశమున్నా ‘ఆంధ్రజ్యోతి’ ఆ పని చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.50 లక్షలు చెల్లించింది. పైగా... రాష్ట్రంలో మీడియా సంస్థలు, కంపెనీలు, సంస్థలకు సంబంధించి 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు విధానం, రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (బీఎ్‌సఓ) ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. ఇదీ అసలు విషయం. వెరసి... ‘ఆంధ్రజ్యోతి’కి కూటమి సర్కారు నజరానా ఇవ్వడం నిజం కాదు. ఎన్టీఆర్‌ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్న ఒక అంశాన్ని పరిష్కరించడమే ఇప్పుడు జరిగింది.


రోత పత్రిక:ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు

నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో

వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది.

అసలు నిజం: ‘ఆంధ్రజ్యోతి’ అంటే జగన్‌కు విద్వేషం. రాజకీయంగా భజన చేయదన్న కోపం. అందుకే, 2019లో అధికారంలోకి రాగానే విశాఖలోని ‘ఆంధ్రజ్యోతి’ భూమిపై కన్నేశారు. భూమిని తీసుకున్న తర్వాత మూడేళ్లలోగా భవనం నిర్మించలేదు కాబట్టి దానిని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇప్పించారు. నిజానికి ‘ఆంధ్రజ్యోతి’కి భూమి కేటాయిస్తూ 2017లో ఇచ్చిన జీఓ 251 ప్రకారం ఇంకా మూడేళ్ల కాలపరిమితి పూర్తవ్వలేదు. అప్పటికి తమకిచ్చిన భూమిలో ఉన్న కొండలు, గుట్టలను తొలగించే పనిలో ‘ఆంధ్రజ్యోతి’ చాలావరకు పనులు పూర్తి చేసింది. అయినా సరే... నాటి జగన్‌ ప్రభుత్వం కక్షకొద్దీ నోటీసులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 2019 అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో చట్టప్రకారమే నడుచుకోవాలని జగన్‌ సర్కారును న్యాయస్థానం ఆదేశించింది. అయినా నాటి జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (బీఎ్‌సఓ) 24(6)(3) ప్రకారం ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మరోసారి 2019 నవంబరు 25ననోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ... ‘ప్రజా ప్రయోజనాల కోసం’ అంటూ 2020 జనవరి 30వ తేదీన జీఓ 21 జారీ చేసి, ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయించిన భూములను నాటి జగన్‌ సర్కారు స్వాధీనం చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ హైకోర్టులో సవాల్‌ చేసింది. నాటి ఉత్తర్వులను పక్కన పెడుతూ 2024 నవంబరులో తుది తీర్పు వెలువడింది.


రోత పత్రిక: విశాఖపట్నం రూరల్‌ మండలం పరదేశీపాలెంలో ‘ఆంధ్రజ్యోతి’కి 2012లో 1.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

నిజం: ప్రభుత్వ ఉత్తర్వులు, దాని వెనక నడిచిన ఫైళ్లు, సమాచారం గురించిన కనీస పరిశీలన కూడా చేయకుండానే జగన్‌ ‘యాక్‌ ఛీ’ పత్రిక అబద్ధాలను అచ్చోసిందనడానికి ఇదే నిదర్శనం. 1986లో తొలుత కేటాయించిన భూమిలో కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా... 2017 జూన్‌ 28న ప్రభుత్వం జీఓ 251 ద్వారా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించింది. 2012లో వచ్చిన నూతన భూకేటాయింపు విధానంలోని అంశాలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే తప్ప... ‘యాక్‌ ఛీ’ చెప్పినట్లుగా 2012లో ఎకరన్నర రాసివ్వలేదు.

రోత పత్రిక: ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా భూమి కేటాయించినట్లు నిర్ధారణ అవ్వడంతో 2020లో వైసీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వును రద్దుచేసింది.

నిజం: ‘ప్రజాప్రయోజనాలకు విరుద్ధం’ అనేది ఒట్టి సాకు మాత్రమే. ఆ కారణంపై ‘ఆంధ్రజ్యోతి’కి నోటీసులే ఇవ్వలేదు. ఇది స్వయానా రాష్ట్ర హైకోర్టు చెప్పింది.

రోత పత్రిక: ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపు రద్దు నిర్ణయంపై చట్టప్రకారం ముందుకెళ్లాలని హైకోర్టు గత ఏడాది నవంబరు 29న తీర్పు ఇచ్చింది

నిజం: ఇదో పచ్చి అబద్ధం. చట్టప్రకారం ముందుకు వె ళ్లాలని 2019 అక్టోబరు 17న హైకోర్టు జగన్‌ సర్కారును ఆదేశించింది. ఇక... 2024 నవంబరు 29న హైకోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపు రద్దు ఉత్తర్వుల(జీఓ 21) అమలును నిలిపివేసింది. ‘యాక్‌ఛీ’ చెప్పినట్లుగా గత ఏడాది (2025)లో దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ లేవు.

రోత పత్రిక: చట్టప్రకారం ముందుకెళ్లాలని గత ఏడాది నవంబరు 29న హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపించి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూమికంటే విలువైన భూమిని ‘ఆంధ్రజ్యోతి’కి ఉచితంగా కేటాయించింది

నిజం: కనీస వివరాలు, విలువలు లేకుండానే కథనం రాశారనేందుకు ఇది మరో నిదర్శనం. భూకేటాయింపును రద్దు చేస్తూ జగన్‌ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను 2024లోనే హైకోర్టు పక్కన పెట్టేసింది. 2017లో అన్ని రకాల చట్టాల ప్రకారమే ‘ఆంధ్రజ్యోతి’కి ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి కేటాయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వం చేసిందదే!

రోత పత్రిక: గతంలో ఇచ్చిన భూమికంటే విలువైన భూమిని ‘ఆంధ్రజ్యోతి’కి ఉచితంగా ఇచ్చారు.

నిజం: కాలకూట విషం కక్కడమంటే ఇదే! మరెక్కడో అతి ముఖ్యమైన ప్రదేశంలో, మరింత విలువైన భూమిని ‘ఆంధ్రజ్యోతి’కి చంద్రబాబు కేటాయించారన్నట్లుగా ‘యాక్‌ ఛీ’ పత్రిక చిత్రీకరించింది. ఇది నిజం కానే కాదు. 1986లో ఎన్టీఆర్‌ హయాంలో ఇచ్చిన స్థలంలో హైవే బఫర్‌ జోన్‌కు తీసుకోగా మిగిలిన స్థలానికి వెనుకవైపు 50 సెంట్లు, పక్కన 24 సెంట్లను ఇప్పుడు కేటాయించారు. హైవేను ఆనుకుని ఉన్న భూమికి ప్రత్యామ్నాయంగా... వెనుకా, పక్కనా స్థలం ఇచ్చారు. మరి... రహదారికి ఆనుకుని ఉన్న భూమి విలువైనదా? వెనకాల ఉన్న భూమి విలువైనదా?


హైకోర్టు తీర్పు అపహాస్యం...

భూమిని వెనక్కి తీసుకోవడాని ఇచ్చిన నోటీసుల్లో ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’పై చేసిన ఆరోపణలు, ఆ తర్వాత భూమిని వెనక్కి తీసుకోవడానికి చూపిన కారణాల మధ్య తేడా ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. తొలుత ఇచ్చిన నోటీసులో... ‘నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపు’ అని పేర్కొని, తర్వాత ‘ప్రజా ప్రయోజనాల కోసం’ పేరిట భూములను లాక్కోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిజంగా, ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూమి అవసరమైతే, దానికి సంబంధించిన విధి విధానాల ప్రకారం నడుచుకుని ఉండాల్సిందని స్పష్టం చేసింది. ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను 2024 నవంబరు 29నహైకోర్టు నిలిపివేసింది. అంతేకాదు... ‘కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా ఆ ఉత్తర్వు జారీ చేశారు’ అని కర్రుకాల్చి వాతలు పెట్టింది. ‘యాక్‌ ఛీ’ పత్రిక తన కథనంలో ఈ వివరాలేవీ ప్రస్తావించకుండా, పాఠకులను తప్పుదారి పట్టించే తప్పుడు కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు ‘ఆంధ్రజ్యోతి’కి అప్పనంగా 74 సెంట్ల స్థలం ఇచ్చేశారన్నట్లుగా విషం కక్కింది.

అది ఉచితం కాదు...

‘ఆంధ్రజ్యోతి’కి చంద్రబాబు సర్కారు ఇప్పుడు అప్పనంగా, అయాచితంగా, ఉచితంగా విలువైన భూమి కేటాయించినట్లుగా ‘యాక్‌ఛీ’ పత్రిక వాపోయింది. ఇందులో ఒక్క అక్షరం కూడా నిజం కాదు. 1986లో ఎన్టీఆర్‌ హయాంలో తొలుత భూమి కేటాయించినప్పుడు అప్పటి మార్కెట్‌ (రిజిస్ట్రేషన్‌ వాల్యూ) విలువ చెల్లించిన తర్వాతే భూమి కేటాయించారు. ఇక... హైవే బఫర్‌ జోన్‌కోసం తీసుకుని భూమికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలానికీ ‘ఆంధ్రజ్యోతి’ రూ.50 లక్షలు చెల్లించింది. ఇక... ‘ఉచితం’ ప్రస్తావన ఎక్కడ?


13 నెలలు... బుల్లెట్‌ వేగమా?

‘ఆంధ్రజ్యోతి’కి భూమి ఇచ్చేందుకు బుల్లెట్‌ వేగంతో ఫైలు నడిపారని... కేవలం 12 రోజుల్లోనే ఫైలు క్లియర్‌ అయిందని ‘యాక్‌ ఛీ’ పత్రిక తన అజ్ఞానాన్ని చాటుకుంది. ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపును రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు 2024 నవంబరు 29న పక్కన పెట్టేసింది. రోత పత్రిక వాపోతున్నట్లుగా ‘ఫైలు బుల్లెట్‌ వేగం’తో కదిలి ఉంటే ఎప్పుడో ‘ఆంధ్రజ్యోతి’కి న్యాయం జరిగేది. కానీ... ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం నడుచుకుంది. 2024 డిసెంబరు 21న... అంటే తీర్పు వచ్చిన 23 రోజుల తర్వాత అప్పటి రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ దీనిపై స్పందించారు. హైకోర్టు తీర్పు మేరకు చ ర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ విశాఖ కలెక్టర్‌కు మెమో జారీ చేశారు. తమకు కేటాయించిన భూమిలో 74 సెంట్లు ఎన్‌హెచ్‌-5 బఫర్‌ జోన్‌లో ఉందని, తమకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ‘ఆంధ్రజ్యోతి’ 2025 జనవరిలో విశాఖ కలెక్టర్‌ను కోరింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని విశాఖ కలెక్టర్‌ 2025 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖకు ప్రతిపాదన పంపించారు. దీనిని రెవెన్యూశాఖ పరిశీలించి... ఆర్థిక శాఖ, హౌసింగ్‌ విభాగాల అభిప్రాయాలు తీసుకుంది. ‘ఆంధ్రజ్యోతి’ కోల్పోయిన స్థలం విలువ ఎక్కువా? లేక ప్రత్యామ్నాయంగా అడుగుతున్న భూమి విలువ ఎక్కువా? అని ఆరాతీసింది. అడుగుతున్న దానికంటే, కోల్పోయిన భూమి విలువే ఎక్కువని నిర్ధారణకు వచ్చింది. ‘ప్రత్యామ్నాయ భూమి’ కేటాయింపునకు అంగీకరించింది. 2025 అక్టోబరు 30న జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏపీఎల్‌ఎమ్‌ఏ)లో దీనిపై తీర్మానం చేశారు. ఆ తర్వాత నెలన్నరకు... అంటే డి సెంబరులో భూ మార్పిడి ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదం కోసం పంపించారు. భూ మార్పిడి ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ 2025 డిసెంబరు 12న రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 13 నెలలకుగానీ తుది ఉత్తర్వులు వెలువడలేదు. ఇది బుల్లెట్‌ వేగమా?

‘ఎనిమిదేళ్ల’ లెక్క ఎక్కడిది?

‘ఆంధ్రజ్యోతి’కి 2012లో భూమిని కేటాయిస్తే, ఎనిమిదేళ్ల తర్వాత కూడా నిర్మాణాలు చేపట్టలేదని, అందువల్లే వైసీపీ ప్రభుత్వం భూ కేటాయింపును 2020లో ర ద్దుచేసిందని ‘యాక్‌ ఛీ’ పత్రిక పేర్కొంది. నిజానికి ఈ మొత్తం వివాదంలో ‘2012’ అనే ప్రస్తావన లేనే లేదు. తొలుత భూమి కేటాయించింది 1986లో. తర్వాత ప్రత్యామ్నాయ స్థలం కేటాయించింది 2017లో. ఆపై మూడేళ్ల గడువు కూడా ముగియకముందే నాటి జగన్‌ సర్కారు ‘రద్దు’ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి అనేది బూటకం. జగన్‌ పత్రిక కల్పిత కట్టుకథ. జీఓలు, ఉత్తర్వుల్లో కనిపించని మాయ అది.


కోర్టు తీర్పు తేదీలూ తెలియవా?

‘హైకోర్టు తీర్పు రాకముందే... గత ఏడాది అక్టోబరు 30న ఏపీఎల్‌ఎమ్‌ఏలో ‘ఆంరఽధజ్యోతి’కి భూ మార్పిడి చేసేందుకు ఆమోదం తెలిపారు’ అని జగన్‌ పత్రిక అచ్చోసింది. ఇది.. అజ్ఞానమా లేక లేని బురద జల్లేందుకు ప్రదర్శించిన వికారమా? వాళ్లకే తెలియాలి. ఎందుకంటే... హైకోర్టు తీర్పు వచ్చింది 2024 నవంబరు 29న. దీనిపై ఏపీఎల్‌ఎమ్‌ఏ తీర్మానం జరిగింది 2025 అక్టోబరు 30న. అంటే... తీర్పు ఇచ్చిన 11 నెలలకు తీర్మానం జరిగింది. అయినా సరే... ‘తీర్పు రాకముందే’ అంటూ చీప్‌ రాతలు రాసేసింది.

ఇన్నాళ్లకు... ఇప్పుడే ఈ ఏడుపు ఎందుకో?

‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తూ 2025 డిసెంబరు 12వ తేదీనే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ హయాంలోలాగా జీవోలను ఇప్పుడు చీకటి కొట్లలో వేసి బంధించడంలేదు. అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. అంటే... ఈ విషయం జగన్‌ పత్రికకు అప్పుడే తెలిసినా, నెల తర్వాతే విషం చిమ్మడానికి కారణమేమిటి? తెలంగాణలో తన ‘అస్మదీయుల’కు ఇబ్బంది తలెత్తడాన్ని జీర్ణించుకోలేక, ఇప్పుడు ఈ రూపంలో ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు వెళ్లగక్కారని అర్థమవుతోంది.

Updated Date - Jan 21 , 2026 | 07:05 AM