అధికారుల జాప్యానికి.. లబ్ధిదారులను బాధ్యులు చేయకూడదు!
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:32 AM
సామాజిక భద్రత పింఛన్ విషయంలో అధికారులు చేసిన జాప్యానికి లబ్ధిదారులను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన లబ్ధిదారుకు దరఖాస్తు చేసిన తేదీ నుంచి రావాల్సిన బకాయిలను లెక్కించి చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
సామాజిక భద్రత పింఛన్‌కు ఆమె అర్హురాలే
దరఖాస్తు తేదీ నుంచి బకాయిలు లెక్కగట్టి చెల్లించండి
ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి చేయండి
అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రత పింఛన్ విషయంలో అధికారులు చేసిన జాప్యానికి లబ్ధిదారులను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన లబ్ధిదారుకు దరఖాస్తు చేసిన తేదీ నుంచి రావాల్సిన బకాయిలను లెక్కించి చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం, కొట్టపాలెం గ్రామానికి చెందిన తిరుపతమ్మ భర్త దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్న ఆయన అనారోగ్యంతో 2023 జూలై 14న మరణించారు. దీంతో వితంతు పింఛన్ కోసం తిరుపతమ్మ 2024లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
అదే రోజు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోపాటు వివిధ కారణాలతో దరఖాస్తు పరిశీలనలో జాప్యం జరిగింది. దీంతో పింఛన్ మంజూరు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తిరుపతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో 2026 ఫిబ్రవరి నుంచి అధికారులు ఆమెకు పింఛన్ ఇస్తున్నారు. దరఖాస్తు తేదీ నుంచి వితంతు పింఛను పొందేందుకు తిరుపతమ్మ అర్హురాలని కోర్టు స్పష్టం చేసింది. 2024 జూన్-2026 ఫిబ్రవరి మధ్య కాలానికి బకాయిలు లెక్కించి ఆమెకు చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
‘ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 పనిదినాల్లో పరిష్కరించాల్సి ఉంది. పిటిషనర్ దరఖాస్తుపై సకాలంలో స్పందించడంలో అధికారులు విఫలమయ్యారు. దరఖాస్తు తేదీ నుంచి పింఛను పొందేందుకు పిటిషనర్ అర్హురాలు. దరఖాస్తు తేదీ నుంచి పిటిషనర్‌కు పింఛన్ ఇవ్వడం ప్రారంభించిన మధ్య కాలానికి బకాయిల సొమ్ము చెల్లించండి. కోర్టు ఉత్తర్వులు అందిన నాటి నుంచి ఎనిమిది వారాల్లో ప్రక్రియను పూర్తి చేయండి’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: