ఏపీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులు.. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్
ABN , Publish Date - Jul 01 , 2026 | 08:22 PM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం మారనుందని ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
అమరావతి, జులై 1: భారతదేశ టూ వీలర్ రంగంలో తిరుపతి కేంద్రంగా సరికొత్త విప్లవం రాబోతోంది. దేశీయ మోటార్ సైకిల్ మార్కెట్లో 2001 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రముఖ సంస్థ 'హీరో మోటోకార్ప్', ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి సిద్ధమైంది. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ ఏపీలో రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నామన్నారు. తర్వాత రాబోయే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ఈ పెట్టుబడులను ఏకంగా 3,200 కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు పవన్ ముంజాల్ ప్రకటించారు. వాహనాల తయారీ రంగంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ వ్యాప్తంగా హీరో సంస్థకు ఉన్న ఆరు తయారీ పరిశ్రమల కంటే తిరుపతిలో ఏర్పాటు కాబోతున్న ఈ సరికొత్త పరిశ్రమ పరిమాణంలోనూ, ఉత్పత్తిలోనూ అన్నింటికంటే అతిపెద్దది కాబోతుండటం విశేషం.
ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ దాదాపు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎనలేనిదని కొనియాడిన ముంజాల్, చంద్రబాబు నాయుడు ఆశయమైన 'స్వర్ణాంధ్ర' సాధన విజన్‌లో హీరో సంస్థ కూడా భాగస్వామి కాబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనతో పాటు సామాజిక బాధ్యతలోనూ హీరో సంస్థ ముందుంటుందని ఆయన చాటిచెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మహిళా పోలీసుల రక్షణ, విధుల నిర్వహణ కోసం తమ సంస్థకు చెందిన అత్యాధునిక 'వీడా' (Vida) ఎలక్ట్రిక్ వాహనాలను (EV) అందించనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ సంస్థ తరఫున ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని పవన్ ముంజాల్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటు పారిశ్రామికంగా, ఇటు సామాజికంగా ఏపీ అభివృద్ధిలో హీరో మోటోకార్ప్ కీలక భాగస్వామి కానుంది.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News