Share News

హేమంత్‌కు ‘డ్రగ్‌ విత్‌డ్రాయల్‌’ లక్షణాలు..!

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:54 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడిచేసిన హేమంత్‌కు ప్రస్తుతం ‘డ్రగ్‌ విత్‌డ్రాయల్‌’ లక్షణాలు ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

హేమంత్‌కు ‘డ్రగ్‌ విత్‌డ్రాయల్‌’ లక్షణాలు..!

  • ఆస్పత్రిలో మంచంపై నుంచి కిందపడ్డ వైనం

  • సీడీ4 కౌంట్‌ తక్కువగా నమోదు

  • హైప్రొటీన్‌ ఆహారం ఇస్తున్న వైద్యులు

అనంతపురం వైద్యం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడిచేసిన హేమంత్‌కు ప్రస్తుతం ‘డ్రగ్‌ విత్‌డ్రాయల్‌’ లక్షణాలు ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మత్తుపదార్థాలకు అలవాటుపడిన వ్యక్తి అకస్మాత్తుగా వాటి వినియోగాన్ని వదిలేస్తే శరీరం, మెదడు తీవ్రమైన ప్రతికూల చర్యలకు లోనవుతాయి. ఈ క్రమంలో రక్తపోటు (బీపీ) పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒక్కోసారి నెమ్మదించడం, మానసిక సమతుల్యత కోల్పోవడం, నిద్రలేమితో బాధపడటం, ఆందోళనకు గురికావడం. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం తదితర లక్షణాలు కనిపిస్తే వాటిని డ్రగ్‌ విత్‌డ్రాయల్‌ లక్షణాలుగా పేర్కొంటారు.

అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న హేమంత్‌, సోమవారం మంచంపై నుంచి అకస్మాత్తుగా కింద పడ్డాడు. వైద్య సిబ్బంది, పోలీసులు గమనించి వెంటనే అతన్ని పడకపైకి చేర్చారు. ఇలా కిందపడటానికి ఆ లక్షణాలే కారణం కావచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. నిందితుడికి చికిత్సలో భాగంగా అన్నిరకాల మాత్రలు, ఇంజెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు.

ఇక నిందితుడికి నిర్వహించిన రక్తపరీక్షల్లో సీడీ4 కౌంట్‌ తక్కువగా వచ్చింది. శరీరంలో రోగనిరోధక శక్తిని పటిష్ఠంగా ఉంచే తెల్లరక్తకణాలలో ముఖ్యమైన రకం సీడీ4 కణాలు. హెచ్‌ఐవీ బాధితుల్లో సాధారణంగా సీడీ4 కౌంట్‌ తగ్గుతుంది. దీంతో హెచ్‌ఐవీ సోకిందా? అనే కోణంలోనూ వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితుడికి హైప్రొటీన్‌ ఆహారాన్ని అందిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ అంశాలపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి స్పందిస్తూ, ప్రస్తుతం నిందితుడి ఆరోగ్యం బాగుందని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:56 AM