Share News

చినుకుపై చిగురాశ!

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:58 AM

ఎల్‌నినో కారణంగా తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కోస్తాంధ్రకు ఊరట దక్కనుంది. 3-4 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి శ్రీకాకుళం జిల్లాకు...

చినుకుపై చిగురాశ!

  • వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం

  • విశాఖకు తూర్పుగా 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

  • నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

  • రేపు అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజామున కళింగపట్నం, గోపాలపూర్‌ మధ్య తీరం దాటే చాన్స్‌

  • మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన

  • కోస్తాలో భారీ వర్షాలు, సీమలో మోస్తరు వానలు

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కోస్తాంధ్రకు ఊరట దక్కనుంది. 3-4 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని గోపాలపూర్‌ సమీపంలో తీరం దాటితే ఉత్తర కోస్తా, కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. గోపాల్‌పూర్‌కు ఉత్తరాన తీరం దాటితే ఉత్తర కోస్తాలో మంచి వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది.

ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పుగా 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంగా రానుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య అంటే కళింగపట్నానికి సమీపంలో తీరం దాటనుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ., అప్పుడప్పుడూ 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. కాబట్టి ఈనెల 25 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.


మూడో నంబరు భద్రతా సూచిక

కళింగపట్నం నుంచి కాకినాడ వరకు అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. సోమవారం పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత దాదాపు 36 గంటలు సముద్రంలో కొనసాగనున్నందున ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు కోస్తాంధ్రలో అనేకచోట్ల వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ, కుంభవృష్టిగా వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్నాయి. కాగా.. వాయుగుండంగా మారే క్రమంలో తీరానికి సమీపంగా వస్తున్నందున ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది తప్ప తుఫాన్‌గా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. కాగా.. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కాకినాడ జిల్లా శంఖవరంలో 6, ఎన్టీఆర్‌ జిల్లా నందలూరులో 5.2, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 4.8, నంద్యాల జిల్లా దుర్వేసిలో 4.5, ఎన్టీఆర్‌ జిల్లా కవులూరులో 4.5, చిత్తూరు జిల్లా రామకుప్పంలో 3.9, అనంతపురం జిల్లా డీ హీరేహాల్‌లో 3.5, కర్నూలు జిల్లా పత్తికొండలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అనిత

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారిక సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌, ఇతర అధికారులతో మంత్రి సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. బుధ, గురువారాల్లో ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నాగావళి, వంశధార నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సరిహద్దు జిల్లాల అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలని, కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రాణనష్టం, పశునష్టం జరగకుండా తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వాగులు, వంకలు, కాజ్‌వేల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని కోరారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 03:58 AM