Share News

కరువు తీరా కురిసింది

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:29 AM

తీవ్ర వాయుగుండం తీరం దాటేటప్పుడు, ఆ తర్వాత భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. మూడు నెలలుగా వణికించిన ఎల్‌నినో ప్రభావానికి చెక్‌ పెడుతూ, పైరు పచ్చలకు వరుస వానలు ప్రాణం పోశాయి. అడుగంటిన జలాశయాల్లోకి తిరిగి వరద ప్రవాహాలు చేరుతున్నాయి.

కరువు తీరా కురిసింది

  • వాగులు, ప్రాజెక్టులకు జలకళ... తీరం దాటాకా జోరు వాన

  • తీరం దాటిన ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల బీభత్సం

  • అడుగంటిన జలాశయాల్లోకి భారీగా ప్రవాహాలు

  • ప్రకాశం బ్యారేజీలోకి 13,315 క్యూసెక్కుల నీరు

  • పోలవరం నుంచి 2.5 లక్షల క్యూసెక్కుల వరద

  • ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు

  • పలుచోట్ల నీట మునిగిన పంటలు

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌): తీవ్ర వాయుగుండం తీరం దాటేటప్పుడు, ఆ తర్వాత భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. మూడు నెలలుగా వణికించిన ఎల్‌నినో ప్రభావానికి చెక్‌ పెడుతూ, పైరు పచ్చలకు వరుస వానలు ప్రాణం పోశాయి. అడుగంటిన జలాశయాల్లోకి తిరిగి వరద ప్రవాహాలు చేరుతున్నాయి. సగం కూడా నిండని విశాఖలోని ముడసర్లోవ, గంభీరం, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతోంది. ఇసుక బయటపడిన ప్రకాశం బ్యారేజీకి రెండు రోజులుగా వచ్చిపడుతున్న వరదను సముద్రంలోకి వదిలేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లాలో, మరికొన్ని చోట్ల వరి పంట ముంపునకు గురైంది. అయితే, మొక్క ఇంకా పూత దశకు కూడా చేరుకోనందున వరికి ముప్పేం లేదని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. మొక్కజొన్న 459.5 హెక్టార్లు, పత్తి 95 హెక్టార్లలో ముంపునకు గురైంది. గెలలతో ఉన్న అరటి చెట్లు విరిగిపడ్డాయి. దెబ్బతిన్న పంటలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. విశాఖలోని ఎండాడలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పురాతనమైన సెయింట్‌ ఆంథోనీ పాఠశాల గోడ కూలిపోయింది. పలుచోట్ల కొండ చరియలు జారిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అత్యధికంగా 18.1సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. 1,700 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో పత్తి పంట మునిగిపోయింది. 129 విద్యుత్‌ స్తంబాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.


పొంగి పొర్లుతున్న వాగులు...

వర్షాలతో కాకినాడ జిల్లా తడిచి ముద్దయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు వరకు జిల్లావ్యాప్తంగా 23.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జగ్గంపేటలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ మునిగిపోయింది. వర్షాలకు తాళ్లరేవులో ఓ ఇంటిగోడ కూలి లక్ష్మీనారాయణ(8) మృతి చెందాడు. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారి, రాకాసి అలలు ఎగసిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 8,042 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. సుద్దగడ్డకు వరద పోటెత్తడంతో పిఠాపురం నియోజకవర్గంలో 2,700 ఎకరాలు నీటమునిగాయి. ఏలేరు వరద ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సగటు వర్షపాతం 114.7గా నమోదైంది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగుతున్నాయి. ఎర్రకాలువ, పోగొండ, జల్లేరు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 850 ఎకరాల్లో వరిపంట ముంపుబారిన పడింది. ప్రకాశం జిల్లాలోని దర్శిలో అత్యధికంగా 28.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

పంటకు ప్రాణం

వర్షాలతో పల్నాడు జిల్లాలో పంటలు కళకళలాడున్నాయి. మిరప సాగు ఊపందుకోనున్నది. నర్సరీలకు పరిమితమైన మిరప నారును పొలాల్లో నాటేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. పత్తి, కంది పంటలకు వర్షం ప్రాణం పోసింది. గుంటూరు జిల్లాలో సగటు వర్షపాతం 66.4 మిల్లీమీటర్లు నమోదయింది. వాణిజ్య పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు తెలిపారు. ఇక..కృష్ణా జిల్లాలో 135.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 2,684.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా తిరువూరులో 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 2500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని చెరువులకు జలకళ వచ్చింది. దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, దేవరపల్లి గ్రామాల్లో మిరప, కురుకూరులో అరటికి కొంతమేర నష్టం జరిగింది. అనపర్తి మండలం పొలమూరు రోడ్డులో ఎర్రకాలువ వంతెన వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయంలోకి వర్షపు నీరు చేరి కొద్ది గంటల పాటు నిలిచిపోయింది.


గలగలా సవ్వళ్లు..జలాశయాల్లోకి వరద ప్రవాహాలు

శ్రీకాకుళం: ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో నదులు ఉప్పొంగాయి. బహుదా నదిలోకి 23వేల క్యూసెక్కులు, నాగావళి నదిలోకి 25వేలు,, వంశధార నదిలోకి 45000 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టేశారు.

విశాఖపట్నం: నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలతో.... ముడసర్లోవ, గంభీరం, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేసింది. గంభీరం రిజర్వాయర్‌ నిండిపోవడంతో మిగులు నీటిని కిందకు విడిచిపెట్టారు. నీరు లేక వెలవెలబోయిన గోస్తనీ నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలకు సింహగిరిపై సహజ జల ధారలు పొంగి పొర్లుతున్నాయి.

అల్లూరి జిల్లా: ఎడతెరిపి లేని వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే ప్రధాన రహదారి పైనుంచి వరద నీరు ప్రవహించింది. కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్‌ (జాతీయ రహదారి 516) మూడో మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి.

కాకినాడ జిల్లా: భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయరుకు భారీగా వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 9 గంటలకు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 850 క్యూసెక్కులు ఉండగా, గురువారం మధ్యాహ్నం 3గంటలకు 30 వేల క్యూసెక్కులకు పెరిగింది. రెండోరోజూ కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో విదేశాలకు బియ్యం ఎగుమతి నిలిచిపోయింది.

తూర్పుగోదావరి: ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. కాటన్‌ బ్యారేజ్‌ 150 గేట్లను అర మీటరు మేర పైకి ఎత్తి 2.4 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి: భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు వచ్చి చేరుతుండటంతో గురువారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 2,46,132 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు ప్రాజెక్టు స్పిల్‌వే డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు.

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కి 13,315 క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజ్‌ వద్ద 11.3 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

ఈ వార్తలనూ చదవండి...

మార్కాపురం జడ్పీపై నేతల కన్ను

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్

Updated Date - Sep 25 , 2026 | 03:29 AM