Share News

బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:20 PM

వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో తమ్మినేని కుటుంబ సభ్యులు రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని ఆరోపించారు.

బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి
TDP MP Kalisetti Appalanaidu

అమరావతి, జులై 20: వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో తమ్మినేని కుటుంబ సభ్యులు రూ.4 కోట్ల భూమి కబ్జా చేశారని ఆరోపించారు. బతికున్న వ్యక్తిని కాగితాల్లో మృతుడిగా చూపించారని ఆయన టీడీపీ ఎంపీ వివరించారు. శ్రీకాకుళం దావులపేరంలో 922 గజాల భూమి లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని వెల్లడించారు.


నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఈ రిజిస్ట్రేషన్ చేశారని ఎంపి కలిశెట్టి పేర్కొన్నారు. తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట 2023లో ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు, క్రిమినల్ ముఠాల సహకారంతో ఈ దందా జరిగిందని వివరించారు. రిజిస్ట్రేషన్‌కు తమ్మినేని సీతారాం కాలేజీ సిబ్బందిని సాక్షులుగా ఉపయోగించారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.


బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని విజయనగరం ఎంపీ అన్నారు. విచారణ తప్పించుకునేందుకు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటూ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎంపీ కలిశెట్టి నిప్పులు చెరిగారు. స్పీకర్ హోదాను తమ్మినేని సీతారాం కళంకితం చేశారని కలిశెట్టి విమర్శించారు.


అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ తమ్మినేనిపై ఆయన మండిపడ్డారు. తమ్మినేని విద్యార్హతలపై తప్పుడు ధ్రువీకరణ పత్రాల ఆరోపణలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ్మినేని కుటుంబ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసి దోషులపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 20 , 2026 | 06:32 PM