Share News

వైసీపీ పాలనలో ఇసుక అక్రమాల కేసు.. సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు..

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో ఇవాళ (గురువారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మషీహ్ ధర్మాసనం ఎదుట వాడీవేడి వాదనలు జరిగాయి.

వైసీపీ పాలనలో ఇసుక అక్రమాల కేసు.. సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు..
Supreme Court

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో ఇవాళ (గురువారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మషీహ్ ధర్మాసనం ఎదుట వాడీవేడి వాదనలు జరిగాయి. ఇసుక అక్రమాలకు బాధ్యులు ఎవరన్నది ఎన్జీటీ (National Green Tribunal)నే తేల్చాలని జేపీ పవర్ వెంచర్స్ తరఫు న్యాయవాది వాదించారు. తమ పేరుపై ఉన్నవి ఏడు లైసెన్సులు మాత్రమేనని తెలిపారు. అందుకే రూ.7 కోట్ల జరిమానాను కోర్టులో జమ చేశామని చెప్పారు. ఎన్జీటీ జరిమానా విధించిన మిగతా ఇసుక క్వారీల లైసెన్సులన్నీ ప్రభుత్వం పేరుపైనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇసుక క్వారీల అసలు యజమానులు ఎవరన్నది ఎన్జీటీయే తేల్చాలని జేపీ పవర్ వెంచర్స్ తరఫు న్యాయవాది కోరారు.


ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించింది. గతంలో క్వారీలలో మైనింగ్ చేసింది జేపీ పవర్ వెంచర్సే అని ఎన్జీటీ నిర్ధారించిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు రూ.18 కోట్ల జరిమానా విధించిందని పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీలో మరోసారి విచారణ అవసరం లేదని, జరిమానాపై తుది నిర్ణయం సుప్రీంకోర్టే తీసుకోవాలని ఎన్జీటీ కేసును ముగించిందని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును మళ్లీ ఎన్జీటీకి పంపాలా, లేదా? అనే విషయంపై తదుపరి విచారణ సందర్భంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

Updated Date - Jul 30 , 2026 | 12:21 PM