Share News

జగనన్న రాక్షసత్వం.. నిర్వేదంలో షర్మిల

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:35 PM

మాట తప్పం మడమ తిప్పం.. ప్రతి అక్కాచెల్లెమ్మల ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలంటూ ప్రతిపక్ష నేతగానే కాదు, ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నోటి నుంచి వెలువడిన అణిముత్యాలివి.

జగనన్న రాక్షసత్వం.. నిర్వేదంలో షర్మిల

అమరావతి, అక్టోబర్ 20: మాట తప్పం మడమ తిప్పం.. ప్రతి అక్కాచెల్లెమ్మల ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలంటూ ప్రతిపక్ష నేతగానే కాదు, ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నోటి నుంచి వెలువడిన అణిముత్యాలివి. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఇలా ప్రవచనాలు చెప్పే ఆయనలో మరో కోణం ఉందనే సంగతి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ జాబితాలో తొలిపేరు ఆయన సోదరి వైఎస్ షర్మిల. ఆమె పట్ల సోదరుడు జగన్ మరోసారి రాక్షసత్వం ప్రదర్శించారనే ఓ చర్చ వాడివేడిగా సాగుతోంది.


ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డిని యూఎస్‌లో స్థిరపడిన కర్నూలు జిల్లా వాస్తవ్యులు రఘురామిరెడ్డితో వివాహం నిశ్చయమైంది. సెప్టెంబర్ 24వ తేదీన నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్ 25న వీరి వివాహం బెంగళూరులోని యలహంక‌ ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల నిర్ణయించారు. అయితే.. వీరి పెళ్లికి ఆ ప్యాలెస్ ఇవ్వనని తన తల్లి వైఎస్ విజయమ్మతో వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే అంజలిరెడ్డి వివాహా శుభలేఖలను ఇప్పటికే అందరికీ అందజేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులనూ వైఎస్ షర్మిల దంపతులు స్వయంగా కలిసి శుభలేఖలు అందజేసి వివాహానికి ఆహ్వానించారు.


అయితే.. ముహూర్తం సమయం సమీపిస్తున్న తరుణంలో వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనంటూ వైఎస్ జగన్ తెగేసి చెప్పడంతో.. వైఎస్ షర్మిల డైలమాలో పడినట్లు తెలుస్తోంది. కుమార్తె పెళ్లి ఎక్కడ చేయాలో తెలియక ఓ విధమైన నిర్వేదంలోకి ఏపీ పీసీసీ చీఫ్ వెళ్లినట్లు సమాచారం. వైఎస్ జగన్ తాజా చర్య రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్దఎత్తున చర్చ సాగుతోంది.


అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 16 నెలలు జైలులో ఉన్నప్పుడూ.. జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసిన వైసీపీని నిలబెట్టిన చెల్లికి జగనన్న ఇప్పటికే ద్రోహం చేశారనే చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీరిరువురి మధ్య ఆస్తి విషయంలో ఘర్షణ చోటు చేసుకుందనే ప్రచారం సాగింది. తాజాగా ఆడపడుచు ఇంట్లో శుభకార్యానికి కూడా సొంత ప్యాలెస్ ఇవ్వనన్న జగన్ నిర్ణయంతో ఆయన సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి.

Updated Date - Oct 20 , 2026 | 04:37 PM