అసలైన సూత్రధారుల్ని వదలొద్దు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 25 , 2026 | 08:50 PM
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కృషి చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌లో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నల్లాని నందకుమార్‌తో పాటు మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులో పట్టుబడిన వారితోనే దర్యాప్తు ఆగిపోకూడదని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
అటవీ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, వాటి మూలాలను పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ దాదాపు 70 శాతం వరకు తగ్గినట్లు పవన్ పేర్కొన్నారు.
Also Read:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోం మంత్రి అమిత్ షా భేటీ
పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం