మంగళగిరిలో వైసీపీకి షాక్.. మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలోకి వైసీపీ నేతలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:47 PM
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు.
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.
అలాగే ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డి, తాడేపల్లికి చెందిన వైసీపీ సీనియర్ నేత జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నిడమర్రుకు చెందిన వైసీపీ నేత కట్టెపోగు బాబురావు టీడీపీలో చేరారు. గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల నుంచి పలువురు నేతలతో పాటు పలు కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కలిసికట్టుగా పని చేద్దాం: మంత్రి లోకేశ్..
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరిని దేశంలోనే నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రెండేళ్లలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, గ్యాస్ సంబంధిత పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రుల నుంచి స్మశానవాటికల వరకు అవసరమైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మంగళగిరి ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. నియోజకవర్గంలో తాజా చేరికలతో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
వాయుగుండం ఎఫెక్ట్.. రోడ్ల పునరుద్ధరణకు రూ.1,498.30 కోట్ల వ్యయం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి