జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు..?
ABN , Publish Date - Jun 05 , 2026 | 02:48 PM
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు సమాచారం.
అమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు సమాచారం. 2015 నుంచి జనసేనతో, తనతో లింగమనేని ఉన్నారని పార్టీ నేతలకు ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. లింగమనేని అభ్యర్థిత్వంపై ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ముహూర్తం చూసుకుని పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభ సీట్లపై కసరత్తు..
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి మూడు స్థానాలు, జనసేనకి ఒకటి కేటాయించారు. నిన్న (గురువారం) సాయంత్రం సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేశారు. దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించినట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం జనసేన కూడా ఓ ప్రకటన జారీ చేసింది. ఎన్డీయే పొత్తులో భాగంగా జనసేనకి ఒక రాజ్యసభ సీటు కేటాయించారని పేర్కొంది. అభ్యర్థిని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని, ఆ తర్వాత పార్టీ ప్రకటిస్తుందని వెల్లడించింది. జనసేన అభ్యర్థి పేరు దాదాపు ఖరారు కావడంతో టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోం మంత్రి అనిత
ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు