ఆక్వాన్ తుపాను.. విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ ఆదేశం
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:45 PM
ఆక్వాన్ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ప్రకటించారు.
అమరావతి, నవంబర్16: ఆక్వాన్ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ప్రకటించారు. ఆక్వాన్ తుపాన్ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓ వేళ విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అన్నారు. అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పని చేయాలని కోరారు.
ఆక్వాన్ తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎండీ పి. పుల్లారెడ్డి వివరించారు. క్షేత్రస్థాయిలో తుపాను సన్నద్ధతకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నవంబర్ 17, 18 తేదీల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని తెలిపారు. అలాగే వాలిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉన్న వైర్లను బిగించాలని ఆదేశించారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ స్తంభాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అన్నారు.
9.1 మీటర్ల పొడవున్న రెండు లోడ్ల విద్యుత్ స్తంభాలు, 8 మీటర్ల స్తంభాలతో ఓ లోడ్ సిద్ధంగా ఉంచాలని సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. అవసరమైన సిబ్బందిని సమీకరించి సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. పోల్ డిగ్గర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?
జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..