ధీరజ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:54 AM
టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన ధీరజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. టర్కీలోని ఆంటాల్యాలో జరిగిన పోటీల్లో ధీరజ్ అద్భుత ప్రతిభ కనబరిచి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు.. ధీరజ్ సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆర్చరీలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీ వూ సియోక్‌ను ఫైనల్లో ఓడించి స్వర్ణ పతకం సాధించడం ధీరజ్ ప్రతిభకు నిదర్శనమన్నారు.
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ధీరజ్‌తో కలిసి స్వర్ణం సాధించిన కుమ్కుమ్ మోహోద్‌కు, అలాగే టీమ్ ఇండియాకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
Also Read:
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..
గుంటూరు మిర్చికి చైనా బ్రేక్!