గుంటూరు మిర్చికి చైనా బ్రేక్!
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:54 AM
గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు ఎక్స్‌పోర్టు కంపెనీలకు చెందిన సరుకును అక్కడి కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు.
మూడు ఎక్స్‌పోర్టు కంపెనీల సరుకు నిలిపివేత
తనిఖీల్లో మోతాదుకు మించి మిథామిడోపాస్ పురుగుమందు అవశేషాల గుర్తింపు
ఆ కెమికల్ తయారీ లైసెన్సును రద్దు చేయాలి
నేడు ఉద్యానశాఖ కమిషనర్‌తో ఎగుమతిదారుల భేటీ
గుంటూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు ఎక్స్‌పోర్టు కంపెనీలకు చెందిన సరుకును అక్కడి కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు. ఆ కంటైనర్లలోని మిర్చిలో పరిమితికి మించి మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి ఎగుమతి కంపెనీలు చెన్నై షిప్‌యార్డు నుంచి చైనాకు కంటైనర్లలో సరుకు పంపించాయి. వాటిల్లో కొన్నింటిని అక్కడి కస్టమ్స్ అధికారులు ర్యాండమ్‌గా తనిఖీ చేయగా.. మిథామిడోపాస్ అనే కెమికల్‌ను పంట సాగులో వినియోగించినట్లు తేలింది. మూడు కంపెనీలకు చెందిన కంటైనర్లను నిలిపేశారు. ‘ఇకపై మీరు మా దేశానికి మిర్చిని ఎగుమతి చేయొద్దు.. అంటూ కస్టమ్స్ విభాగం నిర్దిష్టమైన ఆదేశాలతో కూడిన ఓ లేఖ కూడా విడుదల చేసింది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాగా, అప్పట్లో స్పైసెస్ బోర్డు జోక్యం చేసుకొని ఎలాగోలా ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లను పాస్ చేయించింది. ఏటా గుంటూరు నుంచి చైనాకు 20 వేలకు పైగా కంటైనర్లలో మిర్చి ఎగుమతి జరుగుతుండగా.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామం మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరుకు తిరస్కరణకు గురైన ఆ మూడు కంపెనీలు ఏంటి? అనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా, మిథామిడోపాస్ పురుగుమందు వాడి సాగు చేసిన మిర్చి పంటను చైనా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆ కెమికల్ తయారీ లైసెన్సును రద్దు చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై సోమవారం ఉద్యానశాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని మిర్చి ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ నేత తోట రామకృష్ణ తెలిపారు.
కోల్డ్‌స్టోరేజీల్లో పేరుకుపోతోన్న నిల్వలు
చైనాకు ఎక్కువగా తేజ వెరైటీ మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తుండటం, మూడు కంపెనీలను ఎగుమతి చేయొద్దని ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో ఎగుమతిదారులు గుంటూరు మిర్చి యార్డులో కొనుగోలు చేసిన తేజ వెరైటీ పంటను కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. 19,70,846 మిర్చి బస్తాలు (ఒక్కో బస్తా 40 కేజీలు) ప్రస్తుతానికి స్టోరేజీల్లో ఉన్నాయి. చైనాలో నిబంధనలు కాస్త సడలించిన తర్వాత ఎగుమతి చేయొచ్చనే ఆలోచనలో పలువురు ఉన్నారు.
ఐపీఎంతో సమస్యకు పరిష్కారం
కేంద్రం ఇంటిగ్రేటెడ్ పెస్టు మేనేజ్‌మెంట్ (ఐపీఎం) కార్యక్రమం కింద రైతుకు పంట సాగు చేపట్టే సమయం నుంచే నాణ్యమైన మిర్చి నారు, సంరక్షణ చర్యలు వంటి వాటిపై సబ్సిడీ ఇస్తోంది. ఐపీఎం పాటించి పండించిన మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేసేందుకు కంపెనీలకు కూడా రాయితీలు ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమంపై సరైన అవగాహన లేకపోవడంతో రైతులు సంప్రదాయంగా పురుగుమందులనే వినియోగించి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పంట సీజన్ నుంచి ఎంపిక చేసిన క్లస్టర్లలో ఐపీఎం కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కేంద్రం తాజాగా ఉద్యాన శాఖకు ఆదేశించింది. దీనిపై ఢిల్లీలో వర్క్‌షాప్ కూడా నిర్వహించింది.