మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు రూ.20లక్షల ఆర్థికసాయం..
ABN , Publish Date - Aug 09 , 2026 | 09:32 PM
వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అమరావతి: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రూ.20లక్షల ఆర్థికసాయాన్ని బాధిత కుటుంబానికి ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలో ఈ నెల 3న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంకను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధిత యువతి.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రియాంక కుటుంబానికి హామీ ఇస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఆ వెంటనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలను సీఎంకు అధికారులు వివరించారు. విద్యార్థిని కేసు విషయమై ఇప్పటికే ఓసారి అధికారులతో సమీక్షించిన చంద్రబాబు.. విద్యార్థిని మృతితో మరోసారి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. అలాగే ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠిన సెక్షన్ల కింద శిక్షలు పడేలా చూడాలని ఆజ్ఞాపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21 వరకు రిమాండ్
వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్