కష్టకాలంలో అండగా నిలిచారు.. ప్రజలకు నారా భువనేశ్వరి ధన్యవాదాలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:35 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సందర్భంగా ప్రజలు తమ కుటుంబానికి అందించిన మద్దతు, చూపిన అభిమానం జీవితాంతం గుర్తుంటాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సందర్భంగా ప్రజలు తమ కుటుంబానికి అందించిన మద్దతు, చూపిన అభిమానం జీవితాంతం గుర్తుంటాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న 53 రోజుల పాటు ప్రజలు తమకు అండగా నిలిచిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె తెలిపారు. ఈ మేరకు నాటి కష్టకాలంలో తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా భువనేశ్వరి పోస్టు చేశారు.
ఈ సందర్భంగా మూడేళ్ల కిందట ఇదే రోజున నాటి పాలకుల అక్రమ నిర్బంధం నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రజల్లోకి వచ్చారని భువనేశ్వరి గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఆ కష్ట సమయంలో తమ కుటుంబానికి ప్రజలు అందించిన అండ కూడా తనకు ఎప్పటికీ గుర్తుంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న సమయంలో తాను రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండే వ్యక్తినైనప్పటికీ.. ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల వద్దకు వచ్చానని భువనేశ్వరి తెలిపారు. ఆ సమయంలో తన కష్టాన్ని ప్రజలు తమ కష్టంగా భావించారని, నిజం గెలవాలని అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. పల్లెల్లోని ఆడబిడ్డల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల వరకు ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కుటుంబానికి సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. ప్రజలు అందించిన ఈ మద్దతు, ఆత్మీయత తమ కుటుంబాన్ని కష్టకాలంలో నిలబెట్టాయని భువనేశ్వరి పేర్కొన్నారు.
గచ్చిబౌలిలో ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి వేలాదిగా యువత, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు తరలివచ్చి అభిమానాన్ని చాటారని భువనేశ్వరి గుర్తుచేశారు. చంద్రబాబు ప్రజల కోసం దశాబ్దాలుగా చేసిన కష్టం వృథా కాలేదని నాటి ప్రజల స్పందన నిరూపించిందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాటి కష్టకాలంలో మహిళలు చూపిన తెగువను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి పాలకుల అణచివేతను ధిక్కరిస్తూ ఆడబిడ్డలు, మహిళలు రోడ్లపైకి వచ్చి తమ గళాన్ని వినిపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపిన మహిళల పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజల ఆత్మీయత, మద్దతు, నమ్మకానికి జీవితాంతం కృతజ్ఞురాలిగా ఉంటానని భువనేశ్వరి స్పష్టం చేశారు. నాటి కష్టకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్థానిక ఎన్నికల్లో భారీ కుట్రకు జగన్ అండ్ కో ప్లాన్.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు
53 రోజుల నిర్బంధం.. మీకోసం చివరి వరకు నిలబడతా.. సీఎం చంద్రబాబు భావోద్వేగ పోస్ట్