Share News

స్టడీ సర్కిళ్ల బలోపేతంతో డీఎస్సీలో పలువురికి ఉద్యోగాలు: మంత్రి డోలా

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:13 PM

కూటమి ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల బలోపేతం చేయడంతో డీఎస్సీలో పలువురు నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

స్టడీ సర్కిళ్ల బలోపేతంతో డీఎస్సీలో పలువురికి ఉద్యోగాలు: మంత్రి డోలా
AP Minister Dola Bala Veeranjaneya Swamy

అమరావతి, జూన్10: కూటమి ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల బలోపేతం చేయడంతో డీఎస్సీలో పలువురు నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో సాంఘిక సంక్షేమ శాఖలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 340 మంది విద్యార్థులకు రూ.2 కోట్లతో ఐఏఎస్ కోచింగ్ అందించామని ఆయన వివరించారు. 200 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వడమే కాకుండా.. ఆ దేశంలో ఉద్యోగ అవకాశాల కల్పన చేపట్టామని చెప్పారు.


1,002 హాస్టళ్లలో 1.70 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం రూ.916 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి డోలా తెలిపారు. 10వ తరగతిలో 85.32 శాతం, ఇంటర్‌లో 72.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. రూ.143 కోట్లతో 774 హాస్టళ్ల ఆధునికీకరణకు పనులు చేపట్టామని వివరించారు. ప్రతి హాస్టల్‌లో టాయిలెట్స్, శానిటేషన్ నిర్వహణకు ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు.


989 హాస్టళ్లలో రూ.19 కోట్లతో ఏఐ సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని మంత్రి డోలా పేర్కొన్నారు. 190 గురుకులాల్లో 2.06 లక్షల మంది విద్యార్థులకు రూ.1,448 కోట్ల వ్యయం చేసినట్లు చెప్పారు. ఐఐటీ, నీట్‌లో గతేడాది 55 మంది ఎంపిక కాగా.. ఈ ఏడాది 127 మంది ఎంపికయ్యారని ఆయన గుర్తు చేశారు. 184 మంది జేఈఈ అడ్వాన్స్‌లో అర్హత సాధించారన్నారు. ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లను 3 నుంచి 10కి పెంచినట్లు వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 4 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటు చేశామని చెప్పారు.


ప్రతి హాస్టల్‌లో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై గురుకులాల్లో ప్రత్యేక దృష్టి సారించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వివరించారు. సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో మెకనైజ్డ్ కిచెన్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గాయని చెప్పారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు.


ఎస్సీ కళాకారుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. యడవల్లి, జి కొండూరులో లెదర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు రూ.106 కోట్లకుపైగా ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఎస్సీ మత్స్యకార కుటుంబాలకు రూ.5.88 కోట్ల సాయం అందించామని వివరించారు. 329 డిసేబుల్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఎస్సీ ద్వారా 24 మంది దివ్యాంగ ఉపాధ్యాయుల నియామకం చేశామన్నారు.


ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం తిరుపతిలో కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంద్రధనస్సు పథకం ద్వారా దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1075 ప్రభుత్వ సేవల అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయాలు చేయొద్దని రాజకీయ పార్టీలకు మంత్రి డోలా హితవు పలికారు. ఈ ప్రమాదంపై ఎన్డీయే ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. 33 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ప్రమాదం జరగలేదని కార్మికులే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత భద్రతా వ్యవస్థల మార్పుపై చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒక ఉద్యోగిని తొలగించలేదు: మంత్రి కొండపల్లి

హత్య కేసులో 13 మంది నిందితులకు జీవిత ఖైదు

For More AP News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 06:36 PM