Share News

డిమాండ్లపై ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల తొలి విడత చర్చలు పూర్తి

ABN , Publish Date - Aug 27 , 2026 | 09:57 PM

జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, జూడా ప్రతినిధుల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి.

డిమాండ్లపై ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల తొలి విడత చర్చలు పూర్తి

అమరావతి, ఆగస్టు27: జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, జూడా ప్రతినిధుల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎదుట జూడాలు ఆరు డిమాండ్లు ఉంచారు. వీటిలో ఐదు అంశాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


అయితే స్టైపెండ్ పెంపు అంశంపై మరోసారి చర్చలు జరుపుతామని జూడాల ప్రతినిధులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాన్ క్లినికల్ పోస్టుల భర్తీ విషయంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ విధానంలో ఇప్పటివరకు 11.05 శాతం పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు వెల్లడించింది. ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సు పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.


జూనియర్ డాక్టర్లకు నిర్ణీత పని వేళలు అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్ అంశాన్ని విడిగా పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Aug 27 , 2026 | 10:00 PM