ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. హౌసింగ్ ఉద్యోగుల 3 రోజుల జీతం కోత ఉత్తర్వులు రద్దు
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:20 PM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) ఉద్యోగుల మూడు రోజుల జీతం కోతపై జారీ చేసిన ఉత్తర్వులను యాజమాన్యం వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల ముందస్తు సమ్మతి లేకుండానే జీతం కోత విధించడం సరైంది కాదని గుర్తించిన నేపథ్యంలో మెమోను రద్దు చేస్తూ ఎండీ పి. అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల కోసం మూడు రోజుల గ్రాస్ శాలరీని వసూలు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను సంస్థ యాజమాన్యం పూర్తిగా రద్దు చేసింది.
ఈ మేరకు జులై 16న జారీ చేసిన మెమోను రద్దు చేస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. అరుణ్ బాబు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల ముందస్తు అనుమతి లేకుండానే జీతం కోత ప్రతిపాదించడం సరైంది కాదని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెమోలో పేర్కొన్నారు.
అలాగే, మూడు రోజుల జీతాన్ని ఉద్యోగుల సంక్షేమ నిధికి జమ చేయాలన్న ఆదేశాలు పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. జీతం కోతకు సంబంధించిన అన్ని ఉత్తర్వులు తక్షణమే అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ అధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఎండీ పి. అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు.
Also Read:
నేను సచివాలయానికే పరిమితం కాను.. సామాన్యుడిలా ప్రజల్లో ఉంటా: సీఎం చంద్రబాబు
ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్