నేను సచివాలయానికే పరిమితం కాను.. సామాన్యుడిలా ప్రజల్లో ఉంటా: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:08 PM
కర్నూలు జిల్లా ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటించి 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల సంక్షేమం, ఆలూరు అభివృద్ధి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందంటూ సభలో కీలక ప్రసంగం చేశారు.
కర్నూలు, జులై 25: తాను సచివాలయానికే పరిమితం కాకుండా సామాన్యుడిలా ప్రజల మధ్యలోనే ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలోని ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటించి 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించిన సీఎం.. వంటగదిని ఫార్మసీగా, ఆహారాన్ని ఔషధంగా మార్చుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని హితవు పలికారు. సాంకేతికతను జోడిస్తూ 'ఏఐ డాక్టర్' సేవలను అందుబాటులోకి తెచ్చి, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేస్తామని వెల్లడించారు. అలాగే భూ హక్కులకు భద్రత కల్పించేందుకు 'బ్లాక్ చైన్ టెక్నాలజీ'ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆలోచించి పంటలు వేయాలని విజ్ఞప్తి చేస్తూనే, ఆలూరు ప్రాంతంలో తాగునీరు, రోడ్ల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
రాయలసీమ సస్యశ్యామలానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన చంద్రబాబు, వేదవతి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును, 2028 నాటికి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని స్పష్టమైన గడువు విధించారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని విమర్శిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
షమీని ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చారు: క్రిస్ శ్రీకాంత్
యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం.. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం