Share News

దర్యాప్తు అధికారి ఎదుట హజరుకండి: ఐపీఎస్ అధికారికి హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Mar 02 , 2026 | 09:02 PM

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముందు హాజరు కావాలని బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది.

దర్యాప్తు అధికారి ఎదుట హజరుకండి: ఐపీఎస్ అధికారికి హైకోర్టు ఆదేశం
AP High Court

అమరావతి, మార్చి 02: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముందు హాజరు కావాలని బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది. మార్చి 5వ తేదీ లేదా అంతకంటే ముందు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని జారీ చేసిన ఆ ఆదేశాల్లో నాయక్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి కఠిన చర్యలకు పాల్పడకుండా చట్టంలోని నిబంధనలను లోబడి సునీల్ కుమార్ నాయక్‌ను విచారించాలని దర్యాప్తు అధికారికి ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సూచించింది.


ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. ఇక మార్చి 9వ తేదీకి సునీల్ కుమార్ ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాజకీయ కారణాలతో తన పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చారంటూ సునీల్ తరఫు సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు. ఈ కస్టోడియల్ టార్చర్‌తో సునీల్ నాయక్‌కు సంబంధం లేదని కోర్టు దృష్టికి ఈ సందర్భంగా పరమేశ్వర్ తీసుకెళ్లారు.


ఇంకోవైపు సునీల్ నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా కోర్టుకు వివరించారు. అలాగే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిష‌న్‌ను గుంటూరు కోర్టు గతంలో కొట్టి వేసిందంటూ హైకోర్టు దృష్టికి సిద్ధార్థ్ లూథ్రా తీసుకెళ్లారు.

పోలీసుల మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐ‌ఆర్‌లో పేరు లేదనే కారణంతో పిటిషనర్ దర్యాప్తు నుంచి తప్పించుకో లేరని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎఫ్‌‌ఐ‌ఆర్‌లో అందరి నిందితుల పేర్లు చేర్చాల్సిన అవసరం లేదని.. ఈ కేసు దర్యాప్తు సాగుతున్నకొద్ది మరికొంతమంది నిందితులను చేర్చే అవకాశం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తునకు సహకరించాల్సిన చట్టబద్దమైన విధి పిటిషనర్‌కు ఉందని హైకోర్టు తెలిపింది.

Updated Date - Mar 02 , 2026 | 09:44 PM