IPSలు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , Publish Date - Sep 15 , 2026 | 03:19 PM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీకి ప్రభుత్వం ఊరటనిచ్చింది. వారిపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంతి రాణా టాటాను ఈ నెల 4వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విశాల్ గున్నీని సెప్టెంబరు 5వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకున్నట్లు పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
ముంబైకి చెందిన నటి కాదంబరీ జెత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఓ ఫోర్జరీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్), కాంతి రాణా టాటా, విశాల్ గున్ని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌తో కలిసి అధికారులు కుట్రకు పాల్పడ్డారని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి కాదంబరీ జెత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి వేధించారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి పి. సీతారామాంజనేయులు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఆయన ఆగస్టు నెలలో పదవీ విరమణ చేశారు. కాగా, ఇదే కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
Also Read:
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
అమరావతి జేఏసీ సభ్యుడు రామారావు కన్నుమూత