Share News

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం

ABN , Publish Date - Jul 04 , 2026 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారుల రక్షణ, నియంత్రణ చట్టం-2014 ప్రకారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం
Andhra Pradesh Street Vendors

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం తెలిపింది. స్ట్రీట్ వెండర్ల చట్టం-2014 ప్రకారం జీవో ఎంఎస్ నెం.140ను జారీ చేస్తూ, వీధి వ్యాపారులకు వర్తించే నిబంధనలు, అమలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. వెండింగ్ జోన్లలో శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఉండదు. తాత్కాలిక స్టాళ్లు ఏర్పాటు చేసుకుని మాత్రమే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే రహదారులు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.


రోడ్ల విస్తరణ, ప్రజాప్రయోజనాల కోసం అవసరమైతే వీధి వ్యాపారులు తమ వ్యాపార స్థలాన్ని మార్చాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ వ్యవస్థలు, డ్రైనేజీలు, ప్రతిపాదిత రహదారుల సమీపంలో ఎలాంటి ఆక్రమణలు చేయరాదని ఆదేశించింది. వెండింగ్ జోన్లలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, చెత్తను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.


ప్రతి ఐదేళ్లకోసారి పట్టణ స్థానిక సంస్థలు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌ను రూపొందించి అవసరమైన మార్పులు చేయనున్నాయి. అర్హులైన వీధి వ్యాపారులకు మాత్రమే వెండింగ్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. అలాగే వెండింగ్ జోన్లలో మౌలిక సదుపాయాలను యూఎల్‌బీలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.


Also Read:

ప్రభుత్వ డేటా భద్రత.. ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్‌

రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధిపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

Updated Date - Jul 04 , 2026 | 08:42 PM