మా అలైన్‌మెంట్‌ను అంగీకరించాల్సిందే!.. మహానది-గోదావరి అనుసంధానంపై ఏపీ పట్టు
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:41 AM
జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధాన ప్రక్రియను తాము సూచించిన అలైన్‌మెంట్ ప్రకారమే ముందుకు తీసుకెళ్లాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
మహానది-గోదావరి అనుసంధానంపై ఏపీ పట్టు
రాష్ట్రానికి వచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ బృందం
శ్రీకాకుళం జిల్లా నుంచి పోలవరం వరకు
అలైన్‌మెంట్ ప్రాంతాల్లో పరిశీలన
అమరావతి: జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధాన ప్రక్రియను తాము సూచించిన అలైన్‌మెంట్ ప్రకారమే ముందుకు తీసుకెళ్లాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒడిశా నుంచి కాలువ ద్వారా నేరుగా ధవళేశ్వరం వరకు మహానది జలాలను తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇదివరకే అభ్యంతరం తెలిపింది.
ధవళేశ్వరం తీసుకొస్తే ఉపయోగం ఉండదని.. పోలవరం ప్రాజెక్టు దాకా తీసుకురావాలని పట్టుబట్టింది. మహానది జలాలు ఒడిశా దాటాక ఏపీలోని చెరువులు, రిజర్వాయర్లను నింపుతూ పోలవరం ప్రాజెక్టు వరకూ తీసుకెళ్లాలని షరతు విధించింది. ఇందుకు మొదట ససేమిరా అన్న ఎన్‌డబ్ల్యూడీఏ.. ప్రభుత్వం పట్టుబట్టడంతో ఆ ప్రతిపాదనను అంగీకరించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్ పి. దేవేందర్‌రావు నేతృత్వంలోని బృందం ఆ అలైన్‌మెంట్ పరిశీలనకు రాష్ట్రానికి వచ్చింది.
ఈ నెల 6 నుంచి 8వ తేదీ దాకా ఏపీ ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు పోలవరం డ్యాం వద్ద పర్యటించింది. గంగా-కావేరి అనుసంధానంలో భాగంగా మహానది-పోలవరం అనుసంధానం చేపడతారు. ఆ తర్వాత పోలవరం నుంచి సోమశిల మీదుగా కావేరి నదికి నీటిని తరలించాలన్నది ప్రతిపాదన.
ఇదీ అలైన్‌మెంట్..
ఒడిశాలో మహానది జలాలు 490 టీఎంసీలకుగాను 290 టీఎంసీలను ఆ రాష్ట్రం తన ఆయకట్టుకు వాడుకుంటుంది. తర్వాత 179 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో బహుదా నదికి దిగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని దబార్‌సింగి చెరువులోకి మహానది జలాలను ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి రేగులపాడు నీటి వనరులోకి.. దానికి సమీపంలో మందసకు 12 కిలోమీటర్ల దూరంలోని మహేంద్రతనయ రిజర్వాయరుకు తరలిస్తారు.
అనంతరం గొట్టా బ్యారేజీలోకి.. ఆ తర్వాత హిర మండలం రిజర్వాయరులోకి ఎత్తిపోస్తారు. ఇక్కడితో మహానది-గోదావరి అనుసంధాన ప్రక్రియ తొలిదశ ముగుస్తుంది. మలిదశలో తోటపల్లి రిజర్వాయరుకు.. జంఝావతి డ్యాంలోకి.. అక్కడ నుంచి ఆండ్ర రిజర్వాయరులోకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి వీఎన్ పురం రిజర్వాయరులోకి.. ఆ తర్వాత నేరుగా రైవాడ ఇరిగేషన్ ఆనకట్టకు పంపుతారు.
తదుపరి దశలో రైవాడ నుంచి ఏలేశ్వరం వరకు.. చివరిగా పోలవరం జలాశయానికి మహానది జలాలను తీసుకెళ్తారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని ఎన్‌డబ్ల్యూడీఏనే భరించాలని ఏపీ ప్రతిపాదించింది. దీనిపై మరికొద్ది రోజుల్లో ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ అభిప్రాయపడుతోంది.