6 మోడళ్లతో పీపీపీ పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:55 AM
రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పాలసీ 2026ను ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
వేగవంతమైన అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రకటన
ప్రస్తుతం 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు
వీజీఎఫ్ కోసం రూ.1,500 కోట్లు కేటాయింపు
ప్రతి శాఖలోనూ ప్రత్యేక డెస్క్‌ల ఏర్పాటు
పీపీపీ పాలసీ 2026 విడుదల
అమరావతి: రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పాలసీ 2026ను ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరు మోడళ్లతో తీసుకొచ్చిన ఈ పాలసీ వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా రవాణా, లాజిస్టిక్స్, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ మౌలికసదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఈ పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని, ప్రారంభదశలో లాభసాటిగా లేని ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించడం ఈ నిధి ఉద్దేశమని జీవోలో వెల్లడించారు. ప్రణాళిక, ఆమోదం, సేకరణ, పర్యవేక్షణ కోసం ఒక స్పష్టమైన వాతావరణాన్ని ఈ పాలసీ కల్పిస్తుందని వివరించారు.
సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ పాలసీ రూపొందించామని జీవోలో తెలిపారు. పీపీపీ సంబంధిత కార్యకలాపాలు సమన్వయ కేంద్రంగా, పైలట్ ప్రాజెక్టులకు ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేయడానికి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు.
పీపీపీ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి, ఇతర శాఖలకు సలహాలు ఇవ్వడం, సదస్సులు, ఇన్వెస్టర్ల సమావేశాలు నిర్వహించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సులభతరం చేయడం వంటివి ఈ సెల్ బాధ్యతలు. అలాగే పీపీపీ ప్రాజెక్టులకు వర్తించే చట్టాలు, ప్రాజెక్టులు న్యాయ నిబంధనల పరిధిలోనే ఉండేలా చూస్తుంది. రాయితీ ఒప్పందాలు, ఇతర చట్టపరమైన పత్రాలు సమీక్షించి సలహాలు కూడా ఇస్తుంది.
ఇవీ పీపీపీ మోడల్స్
బీవోటీ/డీబీఎఫ్‌ఓటీ: ఈ మోడల్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సంస్థ డిజైన్, నిధులు, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేసి, నిర్ణీత కాలం తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది.
టీవోటీ: ఈ మోడల్ ఇప్పటికే నడుస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ఆస్తుల ద్వారా ఆదాయం పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తిని నిర్ణీత కాలం పాటు నిర్వహించే హక్కు కోసం ముందస్తుగా కొంత ప్రీమియంను ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి.
బీవోటీ యాన్యుటీ/హైబ్రిడ్ యాన్యుటీ మోడల్: ఆర్థికంగా అంత ముఖ్యం కాని, వాణిజ్యపరంగా లాభసాటి కాని ప్రాజెక్టులకు ఇది అనుకూలంగా ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రభుత్వం వార్షిక వాయిదాలు(యాన్యుటీ) చెల్లిస్తుంది.
బీఎల్‌టీ/ఆర్‌వోఎంటీ: వ్యూహాత్మక వసతులు, పాత ఆస్తుల ఆధునీకరణకు ఇది అనుకూలం. నిర్మించి లీజుకు ఇవ్వడం లేదా ఉన్న ఆస్తులను పునరుద్ధరించి, నిర్వహించి, తిరిగి ప్రభుత్వానికి బదిలీ చేయడం వంటి రకాలు ఇందులో ఉంటాయి.
లీజు/మేనేజ్‌మెంట్/సర్వీస్: ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలనుకున్న ప్రాజెక్టులకు ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది. లీజు అద్దె కోసం ప్రభుత్వ ఆస్తులు లేదా సేవలను ప్రైవేటు సంస్థ నిర్వహించడం.
స్విస్ చాలెంజ్: సరికొత్త ఆలోచనలు లేదా మార్కెట్ ఆధారిత పెట్టుబడి అవసరమయ్యే ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టులకు ఇది అనుకూలం. ప్రైవేటు సంస్థ ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి వేలానికి ఉంచుతుంది. వేలంలో వేరే వారు ఎక్కువ కోట్ చేసినా, మొదటి ప్రతిపాదన ఇచ్చిన సంస్థకు ఆ ధరతో మ్యాచ్ చేసి ప్రాజెక్టు దక్కించుకునే అవకాశం ఉంటుంది.