Minister Lokesh: సోషల్ మీడియాలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: లోకేశ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:09 PM
ఏఐ ఆధారిత డీప్ ఫేక్, అసభ్య కంటెంట్‌ను అరికట్టాలని ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నిర్ణీత వయస్సు వచ్చాకే.. సోషల్ మీడియాను వీక్షించేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతి, జనవరి 06: సోషల్ మీడియాలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలు చేస్తే స్వాగతిస్తామన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు చేసే వారిపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై నిర్వహించిన మంత్రుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించబోమన్నారు.
ఏఐ ఆధారిత డీప్ ఫేక్, అసభ్య కంటెంట్‌ను అరికట్టాలని లోకేశ్ తెలిపారు. నిర్ణీత వయస్సు వచ్చిన తర్వాతే.. సోషల్ మీడియాను వీక్షించేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అవమానకర, అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలని చెప్పారు. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని.. అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్‌గా దురుద్దేశ పూర్వక పోస్టులు పెడుతున్నారన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని మంత్రి లోకేశ్ కుండబద్దలు కొట్టారు.
ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. గతంలో జ్యుడిషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉండి అభ్యంతర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్ట్ పెడితే.. తమ పార్టీ వాడైనా ఆ వ్యక్తిని జైలుకు పంపించామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు.. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో కంటెంట్ స్ప్రెడ్ అవుతోందని తెలిపారు. ఫలితంగా ఆ ప్రభావం వెనువెంటనే చూపుతుందని.. తద్వారా కాంట్రవర్సీ ఎక్కువగా జనంలోకి వెళుతోందని సోదాహరణగా వివరించారు లోకేశ్.
ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలని లోకేశ్. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆస్ట్రేలియా, ఈయూ, యూకేలలో ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అమలు చేస్తూ హెవీ పెనాల్టీస్ విధిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డీపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడిషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ అండ్ ప్రైవసీలపై ఈ సమావేశం వేదికగా వారు చర్చించారు.