Share News

పెరుగుతున్న ఎండ తీవ్రత.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచన

ABN , Publish Date - Apr 28 , 2026 | 09:24 PM

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మండలాల్లో బుధవారం ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది.

పెరుగుతున్న ఎండ తీవ్రత.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచన

అమరావతి, ఏప్రిల్ 28: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది. మంగళవారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 41°సి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. కంభం, ఒంటిమిట్టలో గరిష్ఠంగా 44.3°సి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని 140 మండలాల్లో తీవ్రమైన ఎండ ప్రభావం ఉంటుందని పేర్కొంది.


బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 7 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని వివరించింది. రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాల కురుస్తాయని సూచించింది. రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడ వద్దని హెచ్చరిచింది. రాష్ట్రంలో ఎండలతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుందని తెలిపింది.


మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. గుండె, బీపీ, షుగర్ బాధితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దాహం లేకపోయినా మంచి నీరు తాగాలని చెప్పింది. బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్, రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వేడి గాలుల నుంచి చెవులు, కళ్లను కాపాడుకోవాలని ప్రజలకు సూచించింది.


మే మొదటి వారంలో మాక్ ఎక్సర్‌సైజ్: ప్రఖర్ జైన్

రాష్ట్రంలో ఆయిల్ అండ్ కెమికల్ డిజాస్టర్‌పై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సోమవారం వెల్లడించారు. మే మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తామన్నారు. ప్రమాద సమయంలో స్పందనపై శిక్షణ, అవగాహన కోసం వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.15 జిల్లాల్లోని 22 పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.


జాతీయ, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం వీటిని అమలు చేస్తామని తెలిపారు. ప్రాణ-ఆస్తి నష్టం తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. పరిశ్రమలు, జిల్లా యంత్రాంగం సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య, విద్య శాఖల భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తామన్నారు.


ఈ మాక్ ఎక్సర్ సైజ్‌లో ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా పాల్గొంటారని వివరించారు. విశాఖపట్నంలో మాక్ ఎక్సర్‌సైజ్‌ను ఎన్డీఎంఏ కమాండెంట్ పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణలో సమన్వయం పెంపునకు కృషి చేస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

Updated Date - Apr 28 , 2026 | 09:46 PM