Share News

ఇక ‘ప్రతినిధుల’ అమరావతి

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:23 AM

అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలకు కనుల విందు చేసేలా ఈ నెల 13న ఒకే రోజు మూడు ప్రారంభాలు జరగనున్నాయి.

ఇక ‘ప్రతినిధుల’ అమరావతి
MLA And MLC Towers In Amaravati

  • ఎల్లుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభం

  • సీఎం చేతుల మీదుగా జీఏడీకి అప్పగింత

  • అదే రోజు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు అందుబాటులోకి..

  • కోర్‌ క్యాపిటల్‌కు వెళ్లేలా నిర్మాణం

గుంటూరు: అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలకు కనుల విందు చేసేలా ఈ నెల 13న ఒకే రోజు మూడు ప్రారంభాలు జరగనున్నాయి. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు నిర్మాణ సంస్థ అందించనుంది.

ప్రతినిధుల భవనాల తాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనుంది. అనంతరం శాసనసభ అధికారులు ఈ ప్లాట్లను ప్రజా ప్రతినిధులకు కేటాయిస్తారు. ఇదే రోజు రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఈ కార్యక్రమానికి గ్రాండ్‌ వెల్కమ్‌ పలకబోతోంది. అద్భుతంగా నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిల ద్వయాన్ని, సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ ఫేజ్‌- 2ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.


సర్వాంగ సుందరంగా..

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు రాజధానిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు ఆనుకుని ఉంటాయి. ఎన్‌ 11, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కలిసేచోట రాయపూడిలో వీటిని నిర్మించారు. మొత్తం 10.48 ఎకరాల్లో 14.46 లక్షల చదరపు అడుగుల్లో..12 అపార్ట్‌మెంట్లుగా 288 మంది ప్రజా ప్రతినిధులు ఉండడానికి వీలుగా ఎస్‌ ప్లస్‌ 12 అంతస్తులతో నిర్మించారు. ప్రస్తుతం 10.84 లక్షల చ.అ.ల బిల్డప్‌ ఏరియాతో ఆరు ఎమ్మెల్యే క్వార్టర్స్‌, మూడు ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ సిద్ధమయ్యాయి.

MLA-MLC-Towers.jpg


వీటి పరిధిలో 144 ఎమ్మెల్యేల ఫ్లాట్లు, 72 ఎమ్మెల్సీల ఫ్లాట్లు, వెరసి 216 ఫ్లాట్లు రెడీ అయ్యాయి. వీటిని ఈనెల 13న ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక్కో అంతస్తులో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉండేందుకు వీలుగా ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో టవరు 49.80మీటర్ల ఎత్తు ఉంటుంది. అపార్ట్‌మెంట్ల మధ్యనున్న ఖాళీ స్థలంలో అందంగా గార్డెనింగ్‌ చేశారు.


ప్రతి టవర్‌లో 15 మంది సామర్థ్యంతో లిఫ్ట్‌, 1.02 టన్నుల సర్వీస్‌ లిఫ్ట్‌, సీసీ టీవీ పర్యవేక్షణ, ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌, సేంద్రియ వ్యర్థాల కన్వర్టర్‌, జనరేటర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌, 50 కె.వి. సోలార్‌ వ్యవస్థ, 2000 లీటర్ల సోలార్‌ హీటర్‌, ప్రతి ఫ్లాటుకు రెండు కార్ల పార్కింగ్‌తో మొత్తం 303 కార్ల పార్కింగ్‌ సామర్థ్యం, అందులో సందర్శకుల కోసం 10 శాతం కేటాయింపు, జాగింగ్‌ ట్రాక్‌, నడక మార్గాలు, అగ్నిమాపక యంత్ర మార్గం, పిల్లల ఆట స్థలం, బాస్కెట్‌ బాల్‌ కోర్టు వంటి ఎన్నో సదుపాయాలు ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి.

Updated Date - Aug 11 , 2026 | 07:27 AM