Share News

విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకూ పోరాటం: రాజధాని రైతులు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:56 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిని ఆ ప్రాంత రైతులు ఎండగట్టారు. అమరావతిని చంపేందుకు నేటికి అనేక కుట్రలు చేస్తున్నారంటూ జగన్‌పై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు.

విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకూ పోరాటం: రాజధాని రైతులు

అమరావతి, జూన్ 29: అమరావతిని చంపేందుకు నేటికి అనేక కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాజధాని వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని విమర్శించారు. సీఆర్డీఏ పేరును ఏఎంఆర్డీఏగా మార్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. న్యాయస్థానం జోక్యంతో అది మళ్లీ సీఆర్డీఏగా మార్చాల్సి వచ్చిందని అన్నారు. రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం తీరును ఈ సందర్భంగా వారు ఎండగట్టారు.


సోమవారం అమరావతి ప్రాంత రైతులు మాట్లాడుతూ.. రాజధానిని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా ఈ ప్రాంతాన్ని అడవిలా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆ ప్రాంతంలోని రహదారులపై కొండ చెలువలు తిరిగే పరిస్థితి తెచ్చారని వివరించారు. గత ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్లేటప్పుడు.. పోలీసుల పహారాలో.. పరదాల చాటున వెళ్లాడని వ్యంగ్యంగా అన్నారు.


29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రాజధాని కేవలం రైతులది మాత్రమే కాదని.. ఇది ఆరు కోట్ల ఆంధ్రుల ఆస్తి అని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. తమ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి మరీ భూములు ఇచ్చామని వారు వివరించారు. దీని ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.


ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు ఊపందుకున్నాయని వివరించారు. కొందరు వైసీపీ నాయకులు రాజధాని నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి అడ్డుపడే విషపురుగులు.. అనకొండలకు తామే బుద్ధి చెబుతామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి కావడమే తమ ఏకైక లక్ష్యం అని తెలిపారు. విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని రైతులు కుండ బద్దలు కొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు

For More AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 01:31 PM