Share News

సహజీవనానికి అడ్డుగా ఉందని చిన్నారి హత్య

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:22 AM

సహజీవనానికి అడ్డుగా ఉందని.. రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు.

సహజీవనానికి అడ్డుగా ఉందని చిన్నారి హత్య

గుంటూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సహజీవనానికి అడ్డుగా ఉందని.. రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. స్థానిక దేవాపురానికి చెందిన బచ్చు నాగలక్ష్మి, వెంకటసాయి అలియాస్‌ సాయి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కృతిక, ఇషిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఇషిక వయస్సు రెండేళ్లు, వెంకటసాయి ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తూ.. మరో యువతితో సహజీవనం చేస్తుండగా.. నాగలక్ష్మి కూడా గోరంట్లకు చెందిన పొంతంగి సుభాష్‌ అనే యువకుడితో సంబంధం కొనసాగించింది.

దీంతో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయి. పెద్ద కుమార్తె కృతికను వెంకటసాయి తనతో తీసుకెళ్లగా, ఇషిక తల్లి వద్దే ఉండిపోయింది. నగరంలోని భారత్‌పేట ఎనిమిదో లైనులో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న నాగలక్ష్మి, సుభాష్‌ సహజీవనానికి అడ్డుగా ఉందని చిన్నారిని కొడుతూచిత్రహింసలకు గురిచేశారు. ఈ నెల 17న ఉదయం అరుపులు బయటకు వినపడకుండా ఇంట్లో టీవీ సౌండ్‌ పెంచి ఇషిక తలను గోడకు బలంగా మోదారు. చెంపలపై కొట్టి, నోరు మూసి హతమార్చారు. పక్కనే అద్దెకు ఉంటున్న మహిళ ఏమైందని ప్రశ్నించగా.. పాప కిందపడి గాయపడిందని నాగలక్ష్మి, సుభాష్‌ చెప్పారు. అనంతరం చిన్నారిని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పాప శరీరంపై గాయాలు ఉండటంతో.. అనుమానంతో ప్రశ్నించగా.. పారిపోయారు. సమాచారం అందుకున్న అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 06:22 AM