పెళ్లయిన మరుసటి రోజే..!
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:56 AM
చక్కగా చదువుకుని సింగపూర్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వివాహం నిశ్చయం కావడంతో సొంతూరికి వచ్చాడు. తీరా పెళ్లి పీటలెక్కి 24 గంటలు గడవకముందే ఆ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన విషాద ఘటన ఇది. ప్రమాదంలో అతడి మిత్రుడు సైతం దుర్మరణం పాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
పెరవలి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): చక్కగా చదువుకుని సింగపూర్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వివాహం నిశ్చయం కావడంతో సొంతూరికి వచ్చాడు. తీరా పెళ్లి పీటలెక్కి 24 గంటలు గడవకముందే ఆ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన విషాద ఘటన ఇది. ప్రమాదంలో అతడి మిత్రుడు సైతం దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం పిట్టలవేమవరానికి చెందిన నేలపూడి ప్రదీప్ (24) ఇంజనీరింగ్ చదివి సింగపూర్‌లో పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అదే గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 7వ తేదీన పెరవలిలోని కల్యాణ మండపంలో వైభవంగా వివాహం చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం అతని మిత్రుడు కానూరు అగ్రహారానికి చెందిన హరిదాసు బాల వీర సుబ్రహ్మణ్య సాయి (22)తో కలిసి మోటారు బైక్‌పై పనిమీద వెళుతున్నారు. గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు అంబులెన్స్ రావడంతో కంగారులో దానిని ఢీ కొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడిపోయారు. దీంతో ఇరువురికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరినీ తణుకు ఆసుపత్రికి తరలించగా ఒకరి తరువాత ఒకరు మృత్యుఒడిలోకి జారిపోయారు. కొద్దిరోజుల్లో తిరిగి సతీసమేతంగా తిరిగి సింగపూర్ వెళ్లిపోవాల్సి ఉండగా నవ వరుడు మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. కలిసి తిరిగిన మిత్రులిద్దరూ.. కలిసే లోకాన్ని వీడి పోయారంటూ అటు పిట్టలవేమరం, కానూరు అగ్రహారంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’