తెల్లారేసరికి ఊరు జలమయం!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:36 AM
నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతమైన గోరుకల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో సమీపంలోని కొండపైకి పరుగులు తీశారు.
గోరుకల్లు రిజర్వాయర్ గేట్లు ఎత్తిన దుండగులు
ఎస్సార్బీసీలోకి సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం
రక్షణ కట్ట తెగి గోరుకల్లు గ్రామంలోకి పోటెత్తిన వరద
ప్రాణభయంతో కొండపైకి స్థానికుల పరుగులు
ఓటీ రెగ్యులేటర్ దించడంతో తప్పిన పెను ప్రమాదం
పాణ్యం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతమైన గోరుకల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో సమీపంలోని కొండపైకి పరుగులు తీశారు. రిజర్వాయర్ ఓటీ రెగ్యులేటర్ గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గేట్లు ఎత్తిన తర్వాత ఒకేసారి దాదాపు ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎస్సార్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) కాలువకు చేరింది. రెండు వేల క్యూసెక్కులకు మించి ప్రవహించని ఆ కాలువకు ఒకేసారి నీరు పెద్దఎత్తున చేరడంతో నీరు కెనాల్ పైనుంచి కిందకు ఉధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో కాలువకు రక్షణగా నిర్మించిన కట్ట ఒకేసారి మూడు చోట్ల తెగిపోవడంతో నీరు గోరుకల్లు గ్రామంలోకి భారీగా చేరింది. దీంతో తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సమీపంలోని వేణుగోపాలస్వామి కొండపైకి పరుగులు తీశారు. రెండు అడుగుల మేర నీరు చేరి గ్రామం బురద మయంగా మారింది. నీటి ప్రవాహంతో కాలువ రక్షణ కట్ట తెగి పెద్దపెద్ద బండరాళ్లు గ్రామంలోకి కొట్టుకుని వచ్చాయి. గోరుకల్లు, కొండజూటూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. సమీప పంట భూములు ముంపునకు గురయ్యాయి. ఈ అకస్మాత్తు పరిణామంలో పశువులను నీటిలో మునగకుండా గ్రామస్థులు కాపాడుకున్నారు. దాదాపు 45 నిమిషాల సేపు రిజర్వాయర్ నీరు ప్రవహించింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే ఎస్సార్బీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తక్షణమే అక్కడికి చేరుకొని గేట్లు కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఎస్సార్బీసీ కాలువ కట్ట తెగితే సమీప గోరుకల్లు గ్రామంతో పాటు సాబ్జహాన్ కొట్టాల గ్రామాలలో ప్రాణనష్టం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
గేట్లు ఎత్తింది ఎవరు?
రిజర్వాయర్ ద్వారా ఎస్సార్బీసీ కాలువకు సాంకేతిక నిపుణులు మాత్రమే నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు గేట్లను ఎలా ఎత్తారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ వద్ద నిత్యం ఇద్దరు లస్కర్లు విధులు నిర్వహిస్తుంటారు. వీరు గేట్ల పర్యవేక్షణ చేస్తుంటారు. మంగళవారం ఉదయం వర్షం కారణంగా సమీపంలోని షెల్టరు వద్దకు వెళ్లిన సమయంలో దుండగులు గేట్లు ఎత్తారని పలువురు పేర్కొంటున్నారు. గేట్లు ఎత్తడానికి అవసరమైన తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఎలా వెళ్లాయన్నది ప్రశ్న.
ఘటనాస్థలికి కలెక్టర్, ఎమ్మెల్యే
వరద సమాచారం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రిజర్వాయర్ ఈఈ భవానీ ప్రసాద్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తెగిన రక్షణ కట్టలు, దెబ్బతిన్న పంట భూములను పరిశీలించారు. ఓటీ రెగ్యులేటర్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. మూడు చోట్ల నీరు కాలువను ఎక్కిపారడంతో మూడు చోట్ల రక్షణ కట్ట పూర్తిగా ధ్వంసమైందన్నారు. గ్రామంలో రక్షణ సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితి తీసుకువస్తామన్నారు. ఇందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని, ఎక్స్‌కవేటర్‌లు, డోజర్లను ఏర్పాటు చేశారు. 4.50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తహసీల్దారు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం