Share News

పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 27వ గుండె మార్పిడి విజయవంతం

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:40 AM

గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆశాకిరణంగా నిలుస్తోంది. అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో 27వ సారి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం 14 ఏళ్ల బాలికకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 27వ గుండె మార్పిడి విజయవంతం
గుంటూరు నుంచి తెచ్చిన గుండెను పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిలోకి తీసుకెళుతున్న వైద్యులు

తిరుపతి సెంట్రల్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆశాకిరణంగా నిలుస్తోంది. అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో 27వ సారి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం 14 ఏళ్ల బాలికకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాధరెడ్డి కథనం మేరకు... గుంటూరు కిమ్స్‌ ఆస్పత్రిలో బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. ఎయిర్‌ అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో సెప్టెంబరు 20వ తేదీ ఆదివారం సాయంత్రం గుంటూరు నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా రోడ్డు మార్గంలో గుండెను తిరుపతికి తీసుకొచ్చారు. వెంటనే చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ దీపేష్‌ త్రివేది నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స ప్రారంభించింది. ఎనిమిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడి చేసి బాలికకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో బాలిక చికిత్స పొందుతోందని డాక్టర్‌ శ్రీనాధరెడ్డి చెప్పారు.

Updated Date - Sep 22 , 2026 | 01:40 AM