Share News

సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మహిళల మృతి

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:02 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు వెళ్లిన మహిళలకు గొల్లపల్లి రిజర్వాయర్‌ మృత్యుకుహరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మహిళల మృతి
Penukonda Incident

శ్రీ సత్యసాయి, అక్టోబర్ 16: జిల్లాలోని పెనుకొండలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్‌‌లో స్నానం చేసేందుకు దిగిన ఐదుగురు మహిళలు.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాదకర వాతావరణం నెలకొంది. మృతి చెందిన మహిళలు.. పుష్ప, గాయత్రి, హసీనా, మహిన్, హాసిని‌లుగా గుర్తించారు. ఒకేసారి ఐదుగురు మహిళలు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు.. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరదాగా గడిపేందుకు వెళ్లిన వారు విగతజీవులుగా మారడం స్థానికులను కలచివేసింది.


పెనుకొండలో విషాదఛాయలు..

గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి లోతును అంచనా వేయకుండా స్నానాలకు దిగడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి: మంత్రి సవిత

గొల్లపల్లి రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మహిళలు చనిపోయిన ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విహారయాత్రలకు వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవిత సూచించారు. ముఖ్యంగా చెరువులు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, నీటి లోతును అంచనా వేయకుండా నీటిలోకి దిగవద్దని పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సందర్శకులకు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు, భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Updated Date - Oct 16 , 2026 | 05:03 PM