Share News

‘గండికోట’ భూపరిహారం చెల్లింపులో అక్రమాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:32 AM

కడప జిల్లా గండికోట జలాశయం కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపులో అక్రమాలు వాస్తవమేనని ఏపీ లోకాయుక్త నిగ్గుతేల్చింది. నకిలీ సంతకాలతో బోగస్‌ పత్రాలు సృష్టించి రూ.21.92 లక్షలు స్వాహా చేశారు.

‘గండికోట’ భూపరిహారం చెల్లింపులో అక్రమాలు

  • 21.92 లక్షల పరిహారం స్వాహా చేసినట్లు గుర్తింపు

  • నాటి ఇద్దరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల పెన్షన్‌లో కోత

  • ఏపీ లోకాయుక్త జస్టిస్‌ మల్లికార్జునరావు ఉత్తర్వులు

కర్నూలు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా గండికోట జలాశయం కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపులో అక్రమాలు వాస్తవమేనని ఏపీ లోకాయుక్త నిగ్గుతేల్చింది. నకిలీ సంతకాలతో బోగస్‌ పత్రాలు సృష్టించి రూ.21.92 లక్షలు స్వాహా చేశారు. పరిహారం కోరుతూ ఇచ్చిన భూ రికార్డులు సరైనవో, కాదో నిర్ధారించుకోకుండానే నష్టపరిహారం మంజూరు చేసిన అప్పటి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేసిన(రిటైర్‌ అయ్యారు) ఇద్దరికి పెన్షన్లలో కోత విధిస్తూ ఏపీ లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గండికోట జలాశయం నిర్మాణంతో 24 గ్రామాలు, 12వేల ఎకరాలకు పైగా భూములు ముంపునకు గురయ్యాయి.

రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం బుక్కప ట్నం గ్రామంలో సర్వే నం. 676, 630, 636లోని 24.02 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమికి నకిలీ డి-పట్టాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌ ఆధారంగా చెక్క పెద్ద ఓబుల్‌రాజు, ఆయన కుటుంబ సభ్యులకు రూ.21,92,721 భూ పరిహారం చెల్లించారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2013లో ఆప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏపీ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణ చేపట్టారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, బోగస్‌ పత్రాలు సృష్టించి పరిహారం పొందినట్లు నిర్ధారించారు. ఆ సమయంలో పనిచేసిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఇద్దరు రికార్డులు పరిశీలించకుండానే పరిహారం మంజూరుకు సిఫారసు చేశారని గుర్తించారు. దీంతో వారికి వస్తున్న పెన్షన్‌లో మూడేళ్ల పా టు ప్రతినెలా 10 శాతం చొప్పున కోత విధిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు.


మరో రెండు కేసుల్లో...

ఏలూరు రూరల్‌ మండలం శనివారంపేట గ్రామ పంచాయతీలో 2020లో పని చేసిన గ్రేడ్‌-1 సెక్రటరీ స్వచ్ఛ ఆంధ్ర నిధులు దుర్వినియోగం చేశారంటూ ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.రమేశ్‌ చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ చేపట్టింది. దుర్వినియోగం వాస్తవమేనని తేలడంతో గ్రేడ్‌-1 సెక్రటరీకి ఏడాది పాటు ఇంక్రిమెంట్‌ నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

కడప జిల్లా కృష్ణాపురం రెవెన్యూ గ్రామంలో సర్వే నం. 22/3లోని భూమి 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, 2023లో అప్పటి కడప రూరల్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రికార్డులను పరిశీలించకుండానే సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చారంటూ చంద్రగిరి లంబోదర ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌.. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, సబ్‌ రిజిస్ట్రార్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు లోకాయుక్త తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:32 AM