వంటగదిలో పేలుడు.. నలుగురికి గాయాలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 09:36 AM
అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వంటగదిలో ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కాతమ్ముడు సహా నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య, ఆగస్టు 6: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. వంటగదిలో ఉంచిన ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వినిపించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముడు పవిత్ర, ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మంటలు చెలరేగి, ఇంట్లో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మరో ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు.
పేలుడు ఘటన అనంతరం స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి.. చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఫ్రిజ్‌లో ఉంచిన గ్యాస్ సిలిండర్ ఎలా పేలిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో గోపిదిన్నె గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్