విహారయాత్రలో విషాదం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:22 AM
సరదాగా గడిపేందుకు సముద్రతీరానికి వెళ్లిన వారిని అలల రూపంలో మృత్యువు కబళించింది. దసరా సెలవు సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన నెక్ట్స్ ఎరా ప్రైవేటు లిమిటెడ్ శిక్షణ సంస్థకు చెందిన ముగ్గురు యువతులు...
పీజీపేట సముద్ర తీరంలో నలుగురు మృతి
మృతుల్లో ముగ్గురు యువతులు, ఓ యువకుడు
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సరదాగా గడిపేందుకు సముద్రతీరానికి వెళ్లిన వారిని అలల రూపంలో మృత్యువు కబళించింది. దసరా సెలవు సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన నెక్ట్స్ ఎరా ప్రైవేటు లిమిటెడ్ శిక్షణ సంస్థకు చెందిన ముగ్గురు యువతులు, వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్ర తీరంలో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద ఉన్న నెక్ట్స్ ఎరా ప్రైవేటు లిమిటెడ్ శిక్షణ సంస్థకు చెందిన 25 మంది దసరా సందర్భంగా పీజీపేట సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరాదాగా గడుపుతూ సెల్ఫీలు దిగుతూ కొందరు లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొండమామిడిపల్లికి చెందిన మర్రి మహి (18), విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన గొల్లపల్లి పావని (19), గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి (19) సముద్రంలో మునిగిపోయారు.
వీరిని గమనించిన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టానికి చెందిన బిడ్డిక విక్రమ్(25) రక్షించేందుకు ప్రయత్నించాడు. మర్రి మహి, గొల్ల పావనిని ఒడ్డుకు తీసుకొచ్చేసరికే వారిద్దరూ మృతి చెందారు. అనంతరం కొండల మాధవి కోసం విక్రమ్ మరోసారి సముద్రంలో వెళ్లి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. విక్రమ్, మాధవి మృతదేహాలు బుధవారం సముద్రతీరానికి కొట్టుకొచ్చాయి. రూరల్ ఎస్‌ఐ కరణం వెంకట సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి..