Share News

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్.. సెప్టెంబర్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:50 PM

ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి ఈడీ కోర్టు రిమాండ్‌ విధించింది. సెప్టెంబర్‌ 7 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించింది.

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్.. సెప్టెంబర్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ
Karumuri Nageswara Rao Arrest

అమరావతి, ఆగస్టు 24: ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి ఈడీ కోర్టు రిమాండ్‌ విధించింది. నిన్న కారుమూరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరచగా.. కేసుకు సంబంధించి ఈడీ అధికారులు తమ వాదనలు వినిపించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను కోర్టుకు వివరించిన ఈడీ.. కారుమూరి నాగేశ్వరరావు పాత్రపై మరింత విచారణ అవసరమని పేర్కొన్నట్లు సమాచారం. ఈడీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. కారుమూరికి సెప్టెంబర్ 7 వరకూ రిమాండ్ విధించింది.


కోర్టు రిమాండ్‌ ఆదేశాల అనంతరం కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. ఆర్థిక లావాదేవీలు, అక్రమ రవాణాకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కారుమూరి అరెస్టు కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు. సెప్టెంబర్‌ 7 వరకూ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తు, ఈడీ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్!

Updated Date - Aug 24 , 2026 | 07:55 PM