విదేశీ నిపుణుల ఆఖరి పర్యటన
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:31 AM
పోలవరం తొలిదశ పనులు తుది ఘట్టానికి చేరుకుంటుండంతో ప్రధాన డ్యామ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) వేసిన ప్యానల్ ఆఫ్ ఎక్స్‌పెర్ట్స్ (పీఓఈ) సభ్యులు వచ్చే నెల 14వ తేదీన రాజమహేంద్రవరానికి రానున్నారు.
పోలవరానికి మరోసారి అంతర్జాతీయ నిపుణులు
14న రాజమండ్రికి రాక.. 18 వరకు ప్రాజెక్టు పనుల పరిశీలన
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం తొలిదశ పనులు తుది ఘట్టానికి చేరుకుంటుండంతో ప్రధాన డ్యామ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) వేసిన ప్యానల్ ఆఫ్ ఎక్స్‌పెర్ట్స్ (పీఓఈ) సభ్యులు వచ్చే నెల 14వ తేదీన రాజమహేంద్రవరానికి రానున్నారు. ఈ విదేశీ నిపుణులు పోలవరం క్షేత్రంలో పర్యటించి.. ఇప్పటికే పూర్తయిన డయాఫ్రమ్‌వాల్, శరవేగంగా సాగుతున్న ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌వాల్ 2020లో దెబ్బతిన్నాక మరమ్మతులు చేయాలా? లేక కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను సమాంతరంగా నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం సిద్ధమైంది. అయితే డయాఫ్రమ్‌వాల్‌పై అధ్యయనం చేసేందుకు అవసరమైన సాంకేతికానుభవం లేకపోవడంతో ఈ కట్టడాలపై అనుభవం కలిగిన విదేశీ నిపుణులతో కూడిన ప్యానల్‌ను వేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన సీన్ హిచ్‌బర్గెర్ (డ్యామ్ భద్రత), డేవిడ్ బి.పాల్ (జియోలాజికల్ స్పెషలిస్ట్ ఇన్ ఇంజనీరింగ్), గ్లాన్ ఫ్రాన్స్కో డి కికో (గ్లోబల్ ఎక్స్‌పెర్ట్ ఇన్ హైడ్రాలిక్ స్టడీ), రిచెర్డ్ డెనెల్లీ (డ్యామ్ సేఫ్టీ)లను సీడబ్ల్యూసీ నియమించిన విషయం తెలిసిందే.
ఈ నిపుణుల కమిటీ ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు దఫాలు పర్యటించింది. వచ్చే ఏడాది మార్చినాటికి తొలిదశ పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఆఖరిసారిగా పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 12న కెనడా/అమెరికాలో బయలుదేరి 14న ఢిల్లీకి చేరుకుంటారు. అదేరోజున ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చి జల వనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. 15న కేంద్ర జలసంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇతర అధికారులతో పీవోఈ భేటీ అవుతుంది. తర్వాత పోలవరం ప్రాజెక్టులోని నిర్మాణాలను పరిశీలిస్తుంది. 16న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనపై నివేదికను సిద్ధం చేస్తారు. 18న రాజమండ్రి నుంచి ఢిల్లీకి నిపుణుల బృందం తిరుగు ప్రయాణమవుతుంది. 19న అమెరికా/కెనడాకు పీవోఈ సభ్యులు వెళతారు. 16వ తేదీనే అధ్యయన నివేదికను సిద్ధం చేస్తుండటంతో.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లేలోగానే ప్రాజెక్టు పనులపై తుది నివేదిక వెల్లడించే వీలుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక