Share News

ఆ కుటుంబాల్లో ‘డబుల్‌’ ధమాకా!

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:15 AM

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు కుటుంబాలకు ‘డబుల్‌’ ధమాకా విజయం వరించింది.

ఆ కుటుంబాల్లో ‘డబుల్‌’ ధమాకా!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు కుటుంబాలకు ‘డబుల్‌’ ధమాకా విజయం వరించింది. కొన్ని చోట్ల భార్యాభర్తలు కౌన్సిలర్లుగా విజయం సాధిస్తే.. తల్లీ కుమారుడు, అలాగే తండ్రీ కూతుళ్లు, తోడికోడళ్లు ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా విజయకేతనం ఎగురవేశారు.

  • గుంటూరులో కార్పొరేటర్లుగా తల్లీ, కుమారుడు విజయం సాధించారు. 35వ డివిజన్‌ నుంచి తాడిశెట్టి అమల, 42వ డివిజన్‌లో ఆమె తనయుడు ఉత్తేజ్‌ పోటీచేశారు. అమల 3535 ఓట్లు, ఉత్తేజ్‌ 1686 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

  • జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన పరిస్థితుల్లో పక్క పక్క వార్డుల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన తండ్రీ కూతురు ఇద్దరూ విజయం సాధించడం అందరినీ ఆశ్చరపరిచింది. పోతిన హనుమంతరావు ఆరో వార్డులో టీడీపీ అభ్యర్థి మన్యాల సురేశ్‌పై 163 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 7వ వార్డులో ఆయన కుమార్తె జాహ్నవి 502 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి అర్జాల మహేశ్వరిపై గెలుపొందారు.


  • శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో భార్యాభర్తలిద్దరూ టీడీపీ తరఫున కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 25వ వార్డు నుంచి బతకల ప్రియ వైసీపీపై 486 ఓట్ల మెజార్టీతో గెలవగా.. అంతకుముందు ఆమె భర్త కాళ్ల జయదేవ్‌ 24వ వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలిచారు.

  • విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన దంపతులు గెలుపొందారు. 28, 29 వార్డుల నుంచి ఇంటి గోవిందరావు, ఆయన భార్య లక్ష్మి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అలాగే టీడీపీ తరఫున 20వ వార్డు నుంచి పోటీ చేసిన బర్లి శ్రీదేవి, 18వ వార్డు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆమె తోటి కోడలు కింతలి గీతాలక్ష్మి కూడా గెలుపొందారు.

  • మైదుకూరులో తల్లి, కుమారుడు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 25వ వార్డులో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి నారక్కగారి బానుచందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తల్లి బీఎన్‌ పార్వతి స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ రెబల్‌)గా బరిలో నిలిచి 353 ఓట్ల మెజారిటీతో సమీప టీడీపీ అభ్యర్థి బీఎన్‌ నాగేశ్వరిపై విజయం సాదించారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 06:21 AM